HomeUncategorizedPakistan | పాకిస్తాన్ క్రికెట్ గ్రౌండ్‌లో బాంబు పేలుడు.. ఒక‌రు మృతి, ప‌లువురికి గాయాలు

Pakistan | పాకిస్తాన్ క్రికెట్ గ్రౌండ్‌లో బాంబు పేలుడు.. ఒక‌రు మృతి, ప‌లువురికి గాయాలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Pakistan | పాకిస్తాన్‌లోని బజౌర్ జిల్లాలోని ఖార్ తహసీల్‌లోని కౌసర్ క్రికెట్ గ్రౌండ్‌లో (Kausar Cricket Ground) క్రికెట్ మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో జరిగిన పేలుడు ఘటన స్థానికులను, ఆటగాళ్లను భయభ్రాంతులకు గురిచేసింది.

క్రికెట్ మ్యాచ్ (Cricket Match) జరుగుతుండగానే, గ్రౌండ్‌లో బాంబు పేలడం తో మైదానంలో ఉన్నవారంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. ప్రేక్షకులు, పిల్లలతో సహా పలువురు ఈ దాడిలో గాయపడ్డారు. ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందినట్లు అధికారులు నిర్ధారించారు.గాయపడినవారిని తక్షణమే సమీపంలోని ఆసుపత్రులకు తరలించామని, వారి పరిస్థితి మెరుగ్గానే ఉందని పోలీసులు తెలిపారు.

Pakistan | దర్యాప్తు ప్రారంభించిన అధికారులు

పోలీసుల ప్రాథమిక నివేదికల ప్రకారం, ఈ దాడి ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్ (IED) ద్వారా జరిగిందని భావిస్తున్నారు. పేలుడు అనంతరం ప్రాంగణంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. దాంతో స్థానికులలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించలేదు. సరిహద్దు ప్రాంతమైన బజౌర్ జిల్లాలో ఈ దాడి జరగడం, భద్రతా సంస్థల‌కీ ఆందోళన కలిగిస్తోంది. గతంలో కూడా పాకిస్తాన్‌లోని క్రికెట్ స్టేడియాల (Cricket Stadium) సమీపాల్లో పేలుళ్లు జ‌ర‌గ‌డం మ‌నం చూశాం. ఇటీవలి ఘటనల నేపథ్యంలో పాక్‌లో భద్రతా పరిస్థితులపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అంతర్జాతీయ క్రికెట్ జట్లు పాక్ పర్యటనపై ఆలోచ‌న‌లో ప‌డుతున్నాయి. దేశంలో ఉగ్రవాద దాడులు, పేలుళ్లు కొనసాగుతుండటంతో, క్రికెట్ అభిమానులు, నిర్వాహకుల్లోనూ భయం పెరిగిపోతోంది. ఇటీవల, ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని ఓ పోలీస్ స్టేషన్‌పై డ్రోన్ (క్వాడ్‌కాప్టర్) ద్వారా దాడి జరగడం, దేశంలో భద్రతా వ్యవస్థపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది. ఈ పేలుడు సమయంలో తీసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

పేలుడు శబ్దం వినిపించిన వెంటనే మైదానంలో పరుగులు తీస్తున్న ప్రేక్షకులు, ఆటగాళ్లు, పిల్లలు.. వారు ఎదుర్కొన్న భయానక పరిస్థితుల్ని ఆ క్లిప్పింగ్‌లు స్పష్టంగా చూపిస్తున్నాయి. సాధార‌ణ‌ క్రికెట్ మ్యాచ్‌ని (Cricket Match) టార్గెట్ చేయడం ద్వారా ఉగ్రవాద శక్తులు తమ ఉనికిని చాటాలని చూస్తున్నాయన్నది స్పష్టంగా కనిపిస్తోంది. పాక్ ప్రభుత్వం ఇకనైనా మేలుకోకపోతే, సామాన్య ప్రజలు, క్రీడాకారులే కాదు దేశ ప్రతిష్ఠే ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడవచ్చు.