అక్షరటుడే, వెబ్డెస్క్: Assembly Sessions | అసెంబ్లీ సమావేశాల్లో బాడీ షేమింగ్ గురించి తీవ్ర వాగ్వాదం జరిగింది. కాళేశ్వరం కమిషన్ నివేదికతో (Kaleshwaram Commission report) పాటు పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులపై (Municipal Act Amendment Bills) చర్చించేందుకు ఆదివారం అసెంబ్లీ సమావేశమైంది.
ఈ సందర్భంగా బీసీ బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar), మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా బాడీ షేమింగ్ వైపు చర్చ మళ్లింది. ఆకారంలో పెద్దగా ఉంటే అన్నీ తెలుస్తాయని అనుకోవడం పొరపాటని మంత్రి పొన్నం వ్యాఖ్యానించడం దుమారం రేపింది.
చర్చ సందర్భంగా మాజీ మంత్రి గంగుల (former minister MLA Gangula Kamalakar) మాట్లాడుతూ.. బీసీలకు న్యాయం చేయాలని కోరారు. చట్టబద్ధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాస్త్రీయంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వాన్ని తప్పుబట్టేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పొన్నం జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. బీసీ రిజర్వేషన్లపై పొన్నంకు అవగాహన లేదని గంగుల అనడంతో నాకు తెల్వదా? అని పొన్నం అన్నారు.
బీసీ రిజర్వేషన్లపై (BC reservations) అవగాహన తనకు లేదంటే.. గంగుల కంటే ఎక్కువ చదువుకున్నా.. రాజకీయాల్లో విద్యార్థి దశ నుంచి ఉన్నా.. నాకు ఎక్కువ తెల్వదు అనుకుంటే పొరపాటు.. ఆకారంలో పెద్దగా ఉంటే అవగాహన ఎక్కువ ఉంటది అనుకుంటే పొరపాటు అని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
Assembly Sessions | మండిపడ్డ గుంగల..
మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై గంగుల కమలాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాడీ షేమింగ్ (body shaming) గురించి మాట్లాడడంపై మండిపడ్డారు. తాను కూడా బాడీ షేమింగ్ గురించి మాట్లాడితే పెద్ద వివాదం అవుతదని హెచ్చరించారు. అనవసరంగా మాట్లాడొద్దని హితవు పలికారు. శాస్త్రీయంగా బీసీ రిజర్వేషన్లు కల్పించాలని, రాజ్యాంగపరంగా 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.