అక్షరటుడే, బోధన్: Bogus Voting Attempt | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓట్లు వేస్తున్నారు. కాగా.. దొంగ ఓట్లు వేయడానికి యత్నించిన ఇద్దరిపై కేసు నమోదైంది. ఇందుకు సంబంధించిన వివరాలను బోధన్ పట్టణ ఎస్హెచ్వో వెంకటనారాయణ వెల్లడించారు.
Bogus Voting Attempt | రెండు చోట్ల ప్రయత్నం..
వివరాల్లోకి వెళ్తే.. బోధన్ పట్టణంలోని రాకాసిపేట్లోని బూత్ నెం 24, గోశాల ప్రాంతంలో బూత్ నెం. 78లోని పోలింగ్ కేంద్రాల్లో ఇతరుల పేర్లతో ఓటు వేయడానికి ప్రయత్నించారు. దీంతో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్ల గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తున్న సమయంలో, నిందితులు తప్పుడు గుర్తింపు పత్రాలతో ఓటు వేయడానికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలింగ్ ఏజెంట్లు, ఎన్నికల సిబ్బందికి అనుమానం వచ్చి వారిని విచారించగా, వారు దొంగ ఓట్లు వేయడానికి వచ్చినట్లు తేలింది. వీరిపై ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్హెచ్వో తెలిపారు. ఎవరైనా ఇతరుల ఓటు వేయడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.