Rishabh Shetty
Rishabh Shetty | అస‌లు ఏం జ‌రుగుతుంది.. పెద్ద ప్ర‌మాదం నుండి త‌ప్పించుకున్న కాంతార న‌టుడు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rishabh Shetty | క‌న్న‌డ‌లో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన చిత్రం కాంతార. ఈ మూవీకి ప్రీక్వెల్‌గా కాంతార 2 షూటింగ్ (Kantara 2 shooting) జరుగుతోంది. గ‌త కొద్ది రోజులుగా షూటింగ్ జ‌రుపుకుంటుండ‌గా, ఈ సినిమాలో నటిస్తోన్న ఆర్టిస్టులు ఒక్కొక్కరుగా చనిపోతుండడం కన్నడ సినిమా ఇండస్ట్రీలో (Kannada film industry) తీవ్ర చర్చనీయాంశమవుతోంది. కొన్ని రోజుల క్రితం కేరళకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ ప్రమాదవశాత్తూ నదిలో పడి చనిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఇదే సినిమాలో నటిస్తోన్న రాకేష్ పూజారి గుండెపోటుతో కన్ను మూశాడు. జూనియర్ ఆర్టిస్ట్ విజు వికె బుధవారం (జూన్ 11) అర్ధరాత్రి గుండె నొప్పితో కుప్పకూలాడు. ఇలా కొన్ని నెలల వ్యవధిలో కాంతార 2 సినిమాలో భాగమైన ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూయడం అంద‌రిని ఆందోళన‌కు గురి చేస్తోంది.

Rishabh Shetty | పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పింది..

ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రిష‌బ్ శెట్టి (Rishabh Shetty) ఈ మూవీని తెర‌కెక్కిస్తుండ‌గా, ఇలా కాంతార యూనిట్‌కు ప్ర‌మాదాలు చోటు చేసుకుంటుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక శివమొగ్గలోని హోసానగర్​లోని మణి రిజర్వాయర్ (Mani Reservoir) బ్యాక్ వాటర్స్​లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఈ మూవీ టీమ్ త్రుటిలో పెను ప్రమాదాన్ని తప్పించుకుంది. శనివాసం సాయంత్రం 30 మందికి పైగా కళాకారులతో ప్రయాణిస్తున్న పడవ ఒక్క‌సారిగా మునిగిపోయింది. ఈ ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) సైతం అందులో ఉన్నారు. పడవ మునిగిపోయిన వెంటనే అందులో ఉన్నవారందరూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు.

అయితే ఈ ఘటన వ‌ల‌న చిత్ర బృందం తీసుకెళ్లిన కెమెరాతో పాటు పలు సాంకేతిక పరికరాలు నీటిపాలైనట్లు తెలుస్తోంది. హోసానగర్​లోని యాదూర్ రిసార్ట్​కు కళాకారులు మొత్తం సురక్షితంగా తిరిగి వచ్చారని సమాచారం. శుభం శీఘ్రమే అన్నట్లుగా ఈ ప్రమాదం నుంచి రిషబ్ షెట్టి సహా పలువురు నటులు బయటపడటం ఊపిరి పీల్చుకునేలా చేసింది. వరుస ఘటనలతో కాంతార: చాప్టర్ 1 (Kantara Chapter 1) చిత్రయూనిట్ శోకసంద్రంలో మునిగిపోయింది. 2022లో పాన్‌ ఇండియా (Pan India) స్థాయిలో విడుదలై భారీ వసూళ్లు రాబట్టిన ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా కాంతార ఛాప్టర్‌ 1 వస్తోంది. రిషబ్‌ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు.