అక్షరటుడే, వెబ్డెస్క్: Blood Test | ప్రస్తుత కాలంలో మనుషుల ముందున్న అతిపెద్ద లక్ష్యం ఒక్కటే.. ఆరోగ్యంగా ఉండడం. కోవిడ్-19 (Covid 19) మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసిన తర్వాత, దాదాపు ప్రతి ఒక్కరిలో తమ శరీరం, ఆరోగ్యం పట్ల అప్రమత్తత పెరిగింది.
మరణాన్ని కళ్ల ముందు చూసిన అనుభవం, జీవితం ఎంత విలువైనదో అందరికీ గుర్తు చేసింది. ఒకప్పుడు డబ్బు, కెరీర్ లక్ష్యాల వెంట పరుగెత్తిన మనుషులు ఇప్పుడు బతికి ఉండటమే ప్రధాన లక్ష్యంగా జీవిస్తున్నారు. ఈ మార్పుకు అనుగుణంగా వైద్య రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఏ జబ్బుకైనా చికిత్సలు, మందులు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకప్పుడు ప్రాణాంతకంగా భావించిన క్యాన్సర్కూ ఇప్పుడు ఆధునిక చికిత్సలు లభిస్తున్నాయి. ఈ క్రమంలో వైద్య శాస్త్రం (medical science) తాజాగా మరో సంచలనాత్మక అడుగు వేసింది.
Blood Test | రక్తంలో ప్రోటీన్లే చెబుతున్న ఆరోగ్య రహస్యాలు
ఇప్పటివరకు వ్యాధులను గుర్తించడం, వాటికి చికిత్సలు అభివృద్ధి చేయడంలో పరిమితమైన పరిశోధనలు… ఇప్పుడు ఏకంగా మానవుని భవిష్యత్ ఆరోగ్య ప్రమాదాలను, మరణ ముప్పును ముందుగానే అంచనా వేసే స్థాయికి చేరుకున్నాయి. అది కూడా కేవలం ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా. యూకేలోని సర్రే యూనివర్శిటీ (University of Surrey) శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా పరిశోధనలో, రక్తంలో ఉన్న కొన్ని ప్రత్యేక ప్రోటీన్లు భవిష్యత్తులో తీవ్ర వ్యాధులు, మరణ ప్రమాదాన్ని సూచించగలవని గుర్తించారు. 39 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న దాదాపు 38 వేల మంది వ్యక్తుల రక్త నమూనాలను పరిశీలించి ఈ కీలక విషయాన్ని వెలుగులోకి తెచ్చారు.
ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాలు కృషి చేశారు. ప్రతి రక్త నమూనాలో ఉన్న సుమారు 3,000 ప్రోటీన్లను విశ్లేషించి, 5 నుంచి 10 సంవత్సరాల వ్యవధిలో ప్రమాదవశాత్తు కాని మరణాలకు ఏ ప్రోటీన్ స్థాయిలు కారణమవుతాయో గుర్తించారు. ఇందులో వయసు, బాడీ మాస్ ఇండెక్స్ (BMI), చెడు అలవాట్లు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. పరిశోధకుల ప్రకారం, రక్తంలోని కొన్ని ప్రోటీన్ల స్థాయిలు క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, ఇతర దీర్ఘకాలిక అనారోగ్యాల వల్ల వచ్చే మరణ ప్రమాదాన్ని సూచించగలవు.
అయితే, ఈ పరీక్షలు మరణం ఎప్పుడు జరుగుతుందో ఖచ్చితంగా చెప్పవని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. దీన్ని మరణాన్ని Death నిర్ణయించే పరీక్షగా కాకుండా, ముందస్తు హెచ్చరిక వ్యవస్థగా చూడాలని వారు సూచిస్తున్నారు. ఈ ప్రోటీన్ పరీక్షల ద్వారా అనారోగ్యాలను తొలిదశలోనే గుర్తించి, సకాలంలో నివారణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో జీవనశైలిలో మార్పులు, సరైన చికిత్సలు చేపట్టి ప్రాణాపాయాన్ని తగ్గించవచ్చని అభిప్రాయపడుతున్నారు.