అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sarpanch Election | తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) హింసాత్మక మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికల వేడి పెరుగుతుండగా, సూర్యాపేట జిల్లా (Suryapet District)లో సర్పంచ్ ఎన్నిక రక్తపాతం సృష్టించింది. నూతనకల్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో కాంగ్రెస్–బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
Sarpanch Election | 70 మంది కాంగ్రెస్ కార్యకర్తల దాడి
ఘటనా వివరాల్లోకి వెళ్తే… సర్పంచ్ ఎన్నిక ప్రచార సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య మాటామాటా గొడవకు దారితీసింది. ఆ తర్వాత పరిస్థితి అదుపు తప్పి, సుమారు 70 మంది కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారని బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో తీవ్ గాయాల పాలైన మల్లయ్యను హైదరాబాద్ (Hyderabad)కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. ఇంకా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మున్నా మల్లయ్య యాదవ్ సహా 15 మందికి గాయాలు అయినట్లు సమాచారం. గ్రామంలో అదనపు పోలీస్ బలగాలు మొహరించడంతో పరిస్థితి నియంత్రణలోకి వస్తోంది.
మూడు విడతల్లో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలలో సూర్యాపేట జిల్లా కీలకం. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియడంతో, జిల్లా ఎస్పీ నర్సింహ ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. గత ఏడాది ఇదే గ్రామంలో మాజీ సర్పంచ్ హత్యకు గురవడంతో, పోలీసులు ఈసారి ఎక్కువ అప్రమత్తత పాటించారు. 1500 మంది పోలీసు సిబ్బంది నియమించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, రూట్ మొబైల్స్, సమస్యాత్మక కేంద్రాల వద్ద ఆన్లైన్ వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాలతో నిఘా, 170 సమస్యాత్మక గ్రామాల గుర్తింపు, 1284 మందిని ముందస్తుగా బైండోవర్, 53 లైసెన్స్ ఆయుధాల డిపాజిట్, రూ. 9.50 లక్షల విలువైన 1425 లీటర్ల మద్యం సీజ్ వంటివి చేశారు.
ఇంత భారీ బందోబస్తు ఉండగానే గ్రామంలో హత్య జరగడం జిల్లా పోలీసులను ఇబ్బందుల్లోకి నెట్టింది. ప్రజల్లో భయం, రాజకీయ వర్గాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల వేడి పెరుగుతున్న కొద్దీ రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. లింగంపల్లి (Lingampalli)లో హత్య తర్వాత ఆగ్రహంతో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన వారికి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.