MP Asaduddin Owaisi
MP Asaduddin Owaisi | ర‌క్తం, నీరు క‌లిసి ప్ర‌వ‌హించ‌వు అన్నారు.. మ‌రి భార‌త్-పాక్ మ్యాచ్ ఎలా ఆడ‌తారంటూ ఓవైసీ ఫైర్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MP Asaduddin Owaisi | పహల్గామ్ ఉగ్రదాడి త‌ర్వాత భార‌తీయులు పాకిస్తాన్ విష‌యంలో చాలా సీరియ‌స్‌గా ఉన్నారు. ఎంఐఎం (AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (MP Asaduddin Owaisi) సైతం పాకిస్తాన్​ను తీవ్రంగా విమర్శించారు. ‘మీరు మరొక దేశంలోకి వెళ్లి అమాయకులను చంపితే, ఏ దేశం కూడా మౌనంగా చూస్తూ కూర్చొని ఉండదు’ అని ఆయన హెచ్చరించారు. అయితే పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam terror attack) త‌ర్వాత పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించడంపై అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. లోక్‌సభలో ‘ఆపరేషన్ సిందూర్’పై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.

MP Asaduddin Owaisi | నిప్పులు చెరిగిన ఓవైసీ..

సెప్టెంబర్ 14న ఆసియా కప్ 2025లో భాగంగా భారత్-పాకిస్తాన్ (Pakistan) గ్రూప్ దశ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఒవైసీ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన మాట్లాడుతూ, “పాకిస్తాన్‌తో వాణిజ్యం లేదు, విమానాలు రావు, పడవలు రావు, నీరు ఆపేశాం అని చెబుతారు. రక్తం, నీరు కలిసి ప్రవహించవని అన్నారు. అయినా క్రికెట్ మ్యాచ్‌లు ఆడతారా? భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను (India-Pakistan cricket matches) చూడడానికి నా మ‌న‌స్సాక్షి అనుమతించదు” అని అన్నారు. “ఆపరేషన్ సిందూర్‌లో 100 మంది ఉగ్రవాదులను చంపినట్లు చెబుతున్నారు. మరి పహల్గామ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన 25 మంది కుటుంబాల ద‌గ్గ‌ర‌కు వెళ్లి, ప్రతీకారం తీర్చుకున్నాం, ఇప్పుడు మ్యాచ్ చూడండి’ అని చెప్పగల ధైర్యం ప్రభుత్వానికి ఉందా?” అంటూ ప్రశ్నించారు. ఒవైసీతో పాటు ఇతర ప్రతిపక్షాలు కూడా పాక్​తో మ్యాచ్‌లు ఆడడం తగదని అభిప్రాయ పడుతున్నాయి.

ఆసియా కప్ 2025 షెడ్యూల్ సెప్టెంబర్ 9న ప్రారంభం అవుతుంది. కాగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ (India-Pakistan matche) సెప్టెంబర్ 14న ఫిక్స్ చేశారు. మొత్తం 8 దేశాలు పాల్గొంటున్న ఈ టోర్నీలో భారత్, పాక్ సూపర్ ఫోర్‌కు చేరితే మరోసారి తలపడే అవకాశం ఉంది. రెండు జ‌ట్లు ఫైన‌ల్ చేరితో మూడోసారి కూడా వీరు త‌ల‌ప‌డే అవ‌కాశం ఉంది. క్రికెట్ మ్యాచ్​లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.