అక్షరటుడే, వెబ్‌డెస్క్: PM Modi | కేరళ రాజకీయాల్లో బీజేపీ చరిత్ర సృష్టించింది. తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో (Municipal Corporation elections) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా వామపక్ష డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) ఆధిపత్యం కొనసాగుతున్న ఈ కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకుంది. ఇది కేరళ రాజకీయ చరిత్రలో మైలురాయిగా చెప్పుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఈ విజయాన్ని రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా అభివర్ణించారు.
మోదీ మాటల్లో.. ‘తిరువనంతపురం ప్రజలు ఎన్డీఏకు ఇచ్చిన మద్దతు కేరళ అభివృద్ధి ఆకాంక్షలను నెరవేర్చే ఏకైక శక్తిగా పార్టీని నమ్మడాన్ని ప్రతిబింబిస్తుంది. క్షేత్రస్థాయిలో దశాబ్దాలుగా శ్రమిస్తున్న పార్టీ కార్యకర్తల కృషికి ఈ ఫలితం నిదర్శనం’ అని పేర్కొన్నారు. నగర అభివృద్ధి, ప్రజల జీవన నాణ్యత మెరుగుపరచడంలో బీజేపీ కట్టుబడి ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
PM Modi | శశిథరూర్ శుభాకాంక్షలు
కాగా.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ (Shashi Tharoor) బీజేపీ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫలితాలను నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఉదాహరణగా కొనియాడారు. ఎల్డీఎఫ్ పాలనలోని లోపాలు, అక్రమాలపై తాను గతంలోనే ప్రశ్నించానని పేర్కొన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఈ ఎన్నికల ద్వారా స్పష్టమైందని ఆయన తెలిపారు.
PM Modi | అతిపెద్ద పార్టీగా బీజేపీ
101 వార్డులు ఉన్న తిరువనంతపురం కార్పొరేషన్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 50 స్థానాలు గెలుపొందింది. ఇక ఎల్డీఎఫ్ 29 సీట్లకు, యూడీఎఫ్ 19 సీట్లకు పరిమితమయ్యాయి. మిగతా రెండు స్థానాలను స్వతంత్రులు గెలుచుకున్నారు. ఈ గెలుపుతో రాష్ట్ర రాజధాని నగర పాలనలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఈ విజయంతో కేరళ బీజేపీలో కొత్త ఆశలు చిగురించినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.