అక్షరటుడే, వెబ్డెస్క్ : BJP State President | బీసీలను కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసంచేశాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. బీజేపీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పారు.
హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాద్ (Hyderabad) నగరానికి చెందిన పార్టీ ముఖ్య నేతలతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచారంపై నాయకులకు మార్గనిర్దేశం చేశారు. అనంతరం రాంచందర్‌రావు విలేకరులతో మాట్లాడారు.
BJP State President | రెండు రోజుల్లో అభ్యర్థి ఖరారు..
జూబ్లీహిల్స్ ఎన్నికలలో (Jubilee Hills Elections) పార్టీ అభ్యర్థిని జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని రాంచందర్ రావు తెలిపారు. రెండు, మూడు రోజుల్లో అభ్యర్థిని ఖరారు చేస్తామని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలిచి ప్రధాని మోదీకి (PM Modi) గిఫ్ట్ ఇస్తామన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలపడిందని, ఉప ఎన్నికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లో గెలుపు కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు కష్టపడి పని చేయాలని సూచించారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేయాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
BJP State President | బీజేపీతోనే బీసీలకు న్యాయం..
బీజేపీ వల్లే బీసీలకు న్యాయం జరుగుతుందని రాంచందర్‌రావు అన్నారు. కాంగ్రెస్, బీఆర్ ఎస్ బీసీలను మోసగించాయని మండిపడ్డారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచానికి తలమానికంగా చేస్తామని బీఆర్ఎస్ ఎన్నో మాటలు చెప్పిందని.. కానీ ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు ఇచ్చిందన్నారు. రెండు పార్టీలు ఓట్ల కోసం అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసగించాయన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడిన రెండు పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ (BRS Party) లోపాయికారీ ఒప్పందాన్ని ఎండగడతామని చెప్పారు.