అక్షరటుడే, కామారెడ్డి : Municipal Corporation | ముసాయిదా ఓటరు జాబితా పూర్తిగా తప్పులతడకగా ఉందని, వెంటనే ఓటరు జాబితాను సవరించాలని బీజేపీ డిమాండ్ చేసింది. తప్పుగా ముద్రించిన ఓటరు జాబితాను సవరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ ముందు ఆందోళన చేపట్టారు.
Municipal Corporation | 49వ వార్డులోనే భారీగా తప్పులు..
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు (BJP Leaders) మాట్లాడుతూ.. పట్టణంలోని 49 వార్డుల్లో ఒక్కవార్డులో కూడా ఓటరు జాబితా సరిగా లేదన్నారు. ఎక్కడో ఒకచోట తప్పులు దొర్లడం సహజమని, మొత్తం 49 వార్డులలోనే తప్పులు ఎలా దొర్లుతాయని ప్రశ్నించారు. పక్క గ్రామాల్లో పోటీ చేసి ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థికి కామారెడ్డిలో (Kamareddy) ఓటు హక్కు ఉంటుందా అని నిలదీశారు. పక్క గ్రామాలలో ఉన్న ఓటర్లు కామారెడ్డి పట్టణంలో ఎలా ఉంటాయని ప్రశ్నించారు.
Municipal Corporation | అధికారుల నిర్లక్ష్యమే..
ఓటరు సవరణ కోసం అభ్యంతరాల కోసం నిర్వహించిన సమావేశంలో సంబంధిత అధికారులు హాజరు కాలేదని నాయకులు ఆరోపించారు. తప్పుడు జాబితాపై అధికారులు తమకు ఏం తెలియదని చెప్పడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందన్నారు. తప్పులు దొర్లిన ఓటరు జాబితాను సవరించాలని, ఇతర గ్రామాల ఓటర్లను తొలగించి ఒక వార్డు నుంచి మరొక వార్డుకు మారిన ఓటర్లను సరి చేయాలని డిమాండ్ చేశారు. జాబితా సవరణ చేసిన తర్వాత తమకు ఇవ్వాలని, పరిశీలన అనంతరం తుది జాబితా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సుమారు గంట నుంచి బీజేపీ ఆందోళన కొనసాగుతుండగా పోలీసులు చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా బీజేపీ నాయకులు వినిపించుకోవడం లేదు. కమిషనర్ లేదా లోకల్ బాడీ కలెక్టర్ (Local Body Collector) వచ్చి సమాధానం చెప్పాలని, అప్పటివరకు ఇక్కడినుంచి కదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.