అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kerala | కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ (Bjp) సత్తా చాటింది. అక్కడ జరిగిన పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పలు స్థానాల్లో విజయం సాధించింది. కీలకమైన తిరువనంతపురం కార్పొరేషన్‌ను కమలం పార్టీ గెలుచుకుంది. దీనిపై ప్రధాని మోదీ (PM Modi) హర్షం వ్యక్తం చేశారు.
కేరళలో రెండు దశల్లో స్థానిక ఎన్నికలు జరిగాయి. శనివారం కౌంటింగ్ ప్రక్రియ చేపట్టారు. ఈ ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్లో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. నాలుగు దశాబ్దాలుగా అక్కడ అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ను బీజేపీ ఓడించడం గమనార్హం. దీనిపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు చేసిన కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. గెలుపు కోసం శ్రమించిన కార్యకర్తలను అభినందించారు.
Kerala | 50 స్థానాలు కైవసం
తిరువనంతపురం (Thiruvananthapuram) కార్పొరేషన్‌పై నాలుగు దశాబ్దాలకు పైగా ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) పట్టుకు ముగింపు పలుకుతూ, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ గెలుపొందింది. కేరళలోని అత్యంత ముఖ్యమైన ఈ కార్పొరేషన్లో అధికారాన్ని కైవసం చేసుకుంది. 101 వార్డులున్న కార్పొరేషన్లో ఎన్డీఎ 50 వార్డులను గెలుచుకోగా, ఎల్డీఎఫ్ 29 వార్డులకే పరిమితమైంది. యూడీఎఫ్ 19 చోట్ల, ఇతరులు రెండు చోట్ల విజయం సాధించారు. పదేళ్ల క్రితం ఆరు వార్డుల్లో మాత్రమే గెలిచిన ఎన్డీఏ తాజాగా అధికారం సాధించడం గమనార్హం.
Kerala | అసెంబ్లీలో గెలుపే లక్ష్యంగా..
దక్షిణాదిలో బలపడాలని బీజేపీ కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. ఏపీలో టీడీపీ(TDP), జనసేనతో అధికారంలో ఉన్న ఆ పార్టీ కేరళ, తమిళనాడుపై దృష్టి పెట్టింది. 2026లో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో అక్కడ బీజేపీ ఒక్క సీటు కూడా సాధించలేదు. ఈ క్రమంలో తాజాగా తిరువనంతపురం కార్పొరేషన్ గెలుపొందడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. దీంతో ప్రధాని మోదీ సైతం దీనిని చారిత్రాక ఘట్టం అని అభివర్ణించారు. వామపక్ష పార్టీలు ప్రస్తుతం కేరళలో మాత్రమే అధికారంలో ఉన్నాయి. అక్కడ కూడా బీజేపీ బలపడుతుండటం గమనార్హం. కాగా స్థానిక ఎన్నికల్లో బీజేపీ మూడో స్థానంలో ఉన్నప్పటికి.. 1420 గ్రామ పంచాయతీలు, 54 బ్లాక్ పంచాయతీలు, ఒక జిల్లా పంచాయతీల్లో గెలుపొందింది. 324 మున్సిపలు వార్డులు, 93 కార్పొరేషన్ వార్డుల్లో గెలుపొందింది.
కమ్యూనిస్ట్‌లు బలంగా ఉన్న త్రిపురలో గతంలో బీజేపీ విజయం సాధించింది. పశ్చిమ బెంగాల్లో ప్రతిపక్షంలో ఉంది. రానున్న ఎన్నికల్లో బెంగాల్లో అధికారం దక్కించుకోవడంపై ఫోకస్ చేసింది. తాజాగా కేరళలోనూ కమలం పార్టీ జోరు అందుకుంది. ప్రస్తుతం కమ్యూనిస్ట్‌లు అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కేరళనే. మిగతా రాష్ట్రాల్లో వామపక్ష పార్టీలు అంతగా ప్రభావం చూపడం లేదు. దీంతో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నాయి. కానీ కేరళలో మాత్రం అధికారంలో ఉండగా.. అక్కడ కూడా ఆ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తుండటం గమనార్హం. తాజా స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎప్ అత్యధిక స్థానాలు సాధించింది.