అక్షరటుడే, వెబ్‌డెస్క్: BJP President Visit | మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) గెలుపే లక్ష్యంగా కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. పట్టణాల్లో తనకు ఉన్న పట్టును ఓట్లుగా మల్చుకోవడానికి ప్రయత్నిస్తోంది.
రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. పలు మున్సిపల్, కార్పొరేషన్ పీఠాలను కైవసం చేసుకోవడానికి బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా నిజామాబాద్ (Nizamabad), కరీంనగర్ కార్పొరేషన్లపై (Karimnagar Corporations) కమలం జెండా ఎగురవేయాలని చూస్తోంది. అలాగే పలు మున్సిపాలిటీలను సైతం కైవసం చేసుకోడానికి ప్రచారంలో జోరు పెంచింది. ఇందులో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సిన్హా నేడు రాష్ట్రానికి వస్తున్నారు. ఆయన మహబూబ్‌నగర్‌లో జరిగే సభలో పాల్గొంటారు. నబిన్ అధ్యక్షుడు అయ్యాక ఎదుర్కొంటున్న తొలి ఎన్నికలు తెలంగాణ మున్సిపల్ (Telangana Municipal) కావడం గమనార్హం. ఇక్కడ పార్టీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ క్రమంలో పురపోరుపై ఆయన ఫోకస్ పెట్టారు.
BJP President Visit | భారీగా ఏర్పాట్లు
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నితిన్ నబీన్ (Nitin Nabeen) తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారు. దీంతో రాష్ట్ర నాయకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొంటారు మున్సిపల్ ఎన్నికలకు దిశా నిర్దేశం చేస్తారు. నితిన్ నబిన్ బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు (Shamshabad Airport)కు వస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మహబూబ్‌నగర్‌కు వెళ్తారు. మార్గ మధ్యలో ఆయన పలు చోట్ల ఆగి కార్యకర్తలను కలుస్తారు.
BJP President Visit | బీజేపీకి జనసేన మద్దతు
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు తెలిపింది. మంగళవారం అర్ధరాత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan)తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ చీఫ్ రాంచందర్ రావు (BJP Chief Ramchander Rao) భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికలపై చర్చించారు. అనంతరం ఎన్నికల్లో బీజేపీకి ఆయన మద్దతు ప్రకటించారు. అంతేగాకుండా బీజేపీ తరఫున ఆయన ప్రచారం చేయడానికి సైతం ఒప్పుకున్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రచారం చేసే అవకాశం ఉంది.