అక్షరటుడే, వెబ్‌డెస్క్ : West Bengal | పశ్చిమ బెంగాల్లో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ఎంపీపై కొందరు దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.
బెంగాల్లో ఇటీవల భారీ వర్షాలు(Heavy Rains) బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. డార్జిలింగ్‌లో కొండచరియలు విరిగిపడి 17 మంది చనిపోయారు. చాలా ప్రాంతాల్లో వరదలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో మాల్దాహా బీజేపీ ఎంపీ ఖాగెన్ ముర్ము(BJP MP Khagen Murmu) సోమవారం మధ్యాహ్నం వరద ప్రభావిత జల్పైగురి ప్రాంతంలో పర్యటించారు. ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే శంకర్ ఘోష్, బీజేపీ నాయకులు ఉన్నారు.
West Bengal | సామగ్రి పంపిణీ చేస్తుండగా..
ఎంపీ ముర్ము, ఎమ్మెల్యే వరద బాధితులకు సహాయ సామగ్రి పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా వారిపై కొందరు దాడి చేశారు. ఈ ఘటనలో ఎంపీ ఖాగెన్ ముర్ము తలకు తీవ్ర గాయాలై రక్తస్రావమైంది. వెంటనే స్పందించిన బీజేపీ నేతలు ఆయనను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(Congress Party) నాయకులే దాడి చేశారని బీజేపీ ఆరోపించింది. ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.