అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kaleshwaram Project | కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించడాన్ని బీజేపీ ఆహ్వానించింది. కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని తాము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నామని గుర్తు చేసింది.
కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించిన నేపథ్యంలో బీజేపీ నేతలు బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల రాజేందర్ స్పందించారు. బీఆర్ఎస్ తీవ్ర అవినీతికి పాల్పడిందని, సీబీఐ విచారణలోనే (CBI Investigation) అన్ని వాస్తవాలు వెలుగు చూస్తాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మరోవైపు, బీఆర్ఎస్ అవినీతిని బయటపెట్టకుండా కాంగ్రెస్ తీవ్ర జాప్యం చేసిందని లక్ష్మణ్ విమర్శించారు. బీఆర్ ఎస్‌కు (BRS) పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందన్నారు. మరోవైపు, సీబీఐ విచారణను ఎంపీ రాజేందర్ కూడా ఆహ్వానించారు.
Kaleshwaram Project | బీఆర్ఎస్‌దే పూర్తి బాధ్యత..
కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) నిర్మాణంలో తీవ్ర అవినీతి జరిగిందని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని, ఇప్పుడదే నిజమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరంపై బీజేపీ వైఖరే నిజమని మరోసారి రుజువైందని సంజయ్ ఎక్స్‌లో పేర్కొన్నారు. కాళేశ్వరం అవినీతికి బీఆర్ఎస్ పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ను కాపాడుతూ ఆలస్యం చేసిందని మండిపడ్డారు. చివరకు నిజానికి తలవంచి సీబీఐకి కేసు అప్పగింతకు అంగీకరించారన్నారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే సీబీఐకి లేఖ ఇవ్వాలని కోరారు. గతంలో ORR టోల్ టెండర్లపై కాంగ్రెస్ సిట్‌ను ప్రకటించిందని, కానీ ఇప్పటికీ సిట్‌ను ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం డైలీ సీరియల్‌లా కొనసాగుతోందని బండి మండిపడ్డారు.
Kaleshwaram Project | బీఆర్ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు..
కాంగ్రెస్‌ను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ (Congress Party) ప్రయత్నిస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. ఇలాగే చేస్తే బీఆర్ ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. కాళేశ్వరం ప్రాజెక్టుపై 22 నెలలు తాత్సారం చేసి ఇప్పుడు సీబీఐకి ఇచ్చారన్నారు. కాళేశ్వరం కేసు సీబీఐకి ఇవ్వాలని తాము మొదటి నుంచి బీజేపీ డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. చివరకు ఒత్తిడికి తట్టుకోలేక ఇప్పుడు సీబీఐకి అప్పగించడం మంచి పరిణామమని చెప్పారు.
అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) పూర్తి ఆధారాలతో సీబీఐకి సహకరించాలని సూచించారు. తెలంగాణ ప్రజల ధనాన్ని మెక్కినదంతా కక్కించాలని డిమాండ్ చేశారు. మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వరం అవినీతిలో లేరని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. రాజ్యాంగబద్ధ సంస్థలపై గౌరవం లేకుండా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మాట్లాడతారని ధ్వజమెత్తారు. ఎన్నికల కమిషన్‌పై రాహుల్‌గాంధీ వ్యాఖ్యలు సరికాదన్నారు.
Kaleshwaram Project | అన్ని వాస్తవాలు బయటకొస్తాయి..
కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఆదేశించడాన్ని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) ఆహ్వానించారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలన్నీ సీబీఐ విచారణతోనే బయటకు వస్తాయని చెప్పారు. సోమవారం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇన్నాళ్లు తాత్సారం చేసినప్పటికీ, చివరికి సరైన నిర్ణయం తీసుకుందన్నారు. సీబీఐ అన్ని కోణాల్లో విచారించిన వాస్తవాలను బయటకు తెస్తుందన్న నమ్మకం ఉందని తెలిపారు.