అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికపై బీజేపీ (BJP) నాయకత్వం దృష్టి సారించింది. ఎన్నికకు నెల రోజుల సమయం కూడా లేకపోవడంతో అభ్యర్థి ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. సెప్టెంబర్ 9న జరగనున్న ఎన్నిక (Vice President Election)కు సంబంధించి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, బీహార్ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ వంటి వారి పేర్లపై చర్చలు ప్రారంభించింది. అలాగే గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్, సిక్కిం గవర్నర్ ఓం మాథుర్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) నేపథ్యం ఉన్న శేషాద్రి రామానుజాచారి అభ్యర్థిత్వం కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నాయి.
తదుపరి ఉపరాష్ట్రపతి తమ పార్టీకి చెందిన వారని, ఆర్ఎస్ఎస్ భావజాలంతో బలంగా సంబంధం ఉన్న వారిని ఎంపిక చేస్తామని బీజేపీ ఇటీవల ప్రకటించినప్పటికీ, ప్రస్తుత రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ పేరును పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది. రాబోయే బీహార్ ఎన్నికల (Bihar Election) నేపథ్యంలో ఆయనకు పదవి దక్కే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. గత నెలలో అనేక మంది గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లను కలిశారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Vice President | జగదీప్ అనూహ్య రాజీనామాతో..
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ (Jagdeep Dhankhad) అనూహ్యంగా రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. జూలై 21న ఆరోగ్య కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వాస్తవానికి ఆయన పదవీకాలం ఆగస్టు 2027లో ముగియాల్సి ఉంది. అయితే, కేంద్రంతో విభేదాల నేపథ్యంలో ఆయన అనూహ్యంగా రాజీనామా చేసినట్లు ప్రచారం జరిగింది. అప్పటి నుంచి ఆయన బయట ప్రపంచానికి కనిపించకుండా పోయారు. వివిధ అంశాలపై ఏడాది కాలంగా బీజేపీకి, ఉపరాష్ట్రపతికి అగాధం పెరిగింది.
ధన్ఖడ్ రాజీనామా తర్వాత భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకూండా కాషాయ పార్టీ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) పాలక కూటమి అభ్యర్థిని ఎంపిక చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అధికారం ఇచ్చింది. ఉప రాష్ట్రపతి ఎన్నికకు కావాల్సిన సంపూర్ణ మెజార్టీ ఉంది. అయితే, అభ్యర్థి ఎంపికపై చర్చించేందుకు ముఖ్య నేతలు, మిత్రపక్షాలతో వచ్చే వారం భేటీ కానున్నట్లు తెలిసింది.