HomeతెలంగాణPCC Chief Mahesh Kumar Goud | రాజ్యాంగం మార్చేందుకు బీజేపీ కుట్ర.. పీసీసీ చీఫ్...

PCC Chief Mahesh Kumar Goud | రాజ్యాంగం మార్చేందుకు బీజేపీ కుట్ర.. పీసీసీ చీఫ్ మ‌హేశ్‌గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PCC Chief Mahesh Kumar Goud | కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం రాజ్యాంగం మార్చాలని కుట్ర చేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీని దేశం నుంచి త‌రిమేస్తేనే ప్రజలకు మంచి జ‌రుగుతుంద‌న్నారు. క్విట్ ఇండియా దినోత్స‌వం సందర్భంగా శ‌నివారం గాంధీభ‌వ‌న్‌లో జెండాను ఆవిష్క‌రించారు. అనంత‌రం ఇటీవ‌ల పార్టీ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ ఎన్నిక‌ల సంఘంపై (Election Commission) విమ‌ర్శ‌లు చేస్తూ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రదర్శించారు. టీపీసీసీ చీఫ్ తో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఇతర నేత‌లు పాల్గొన్నారు. అనంత‌రం మహేశ్‌కుమార్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

PCC Chief Mahesh Kumar Goud | చ‌రిత్ర‌ను చెరిపేసే కుట్ర‌..

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP) చ‌రిత్ర‌ను మార్చేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆరోపించారు. కాంగ్రెస్ చరిత్రను తుడిచివేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్.. నెహ్రూ, సర్దార్, సుభాష్ చంద్రబోస్ లాంటి నేతలను చరిత్రలో లేకుండా చేద్దామని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక్కరంటే ఒక్కరు కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు (BJP or RSS leaders) లేరన్నారు.

1942లో బ్రిటీష్ పాలకులను తరిమి కొట్టాలని అనేక ఉద్యమాలు జరిగినప్పటికీ క్విట్ ఇండియా ఉద్యమం కీలకమైనదని ఉద్ఘాటించారు. డూ ఆర్ డై నినాదంతో మహాత్మా గాంధీ క్విట్ (Quit India) ఇండియా ఉద్యమం చేశారని కొనియాడారు. దేశ స్వాతంత్య్ర కోసం కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఉద్యమం చేసిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ మాత్ర‌మే దేశ రక్షణ కోసం పని చేస్తోందన్నారు.

PCC Chief Mahesh Kumar Goud | బీజేపీ చేతిలో కీలుబొమ్మ‌గా ఈసీ

స్వతంత్ర సంస్థలను వాడుకొని ప్రతిపక్షాలపై మోదీ ప్రభుత్వం (Modi government) కుట్ర పూరిత దాడి చేస్తోందని పీసీసీ చీఫ్ మ‌హేశ్‌గౌడ్ మండిపడ్డారు. బీజేపీ రాజ్యాంగ‌బ‌ద్ధ సంస్థ‌ల‌ను చేతిలో పెట్టుకుని ఇష్ట‌మొచ్చిన‌ట్లు చేస్తోంద‌ని అన్నారు. ఎన్నిక‌ల సంఘం బీజేపీ జేబు సంస్థ‌గా మారింద‌ని ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్.. బీజేపీ ఫ్రంటల్ ఆర్గనేషన్‌గా మారిందని, దీనిపై ప్రశ్నిస్తే దేశ ద్రోహులుగా ముద్ర వేస్తున్నారని విమ‌ర్శించారు.

కులాలు, మతాల పేరిట బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు భవిష్యత్తు లేకుండా చేస్తోందని విమర్శించారు. క్విట్ బీజేపీ (Quit BJP) అంటేనే దేశానికి భవిష్యత్తు అని తెలిపారు. ఆనాడు ఆంగ్లేయుల పాల‌న‌కు వ్య‌తిరేకంగా చేప‌ట్టిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఇప్పుడు బీజేపీని త‌రిమేసేందుకు ఉద్య‌మించాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌న్నారు.