అక్షరటుడే, వెబ్‌డెస్క్: Amaravati | తెలుగు రాష్ట్రాల ప్రజలు గర్వించేలా అమరావతిలో మరో క్యాంపస్ ఆవిర్భవించనుంది. దేశంలోనే తొలిసారిగా పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పై ఆధారపడి అభివృద్ధి కాబోతున్న ‘ఏఐ ప్లస్ క్యాంపస్'(AI Plus Campus)ను బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS Pilani) అమరావతిలో నెలకొల్పనుంది.
ఈ విషయాన్ని సంస్థ కులపతి, పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా అధికారికంగా ప్రకటించారు. అమరావతి క్యాంపస్‌ను అత్యాధునిక విద్యా ప్రమాణాలతో తీర్చిదిద్దుతూ, రెండు దశల్లో 7000 మంది విద్యార్థులకు అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించామని బిర్లా తెలిపారు. 2027 నుంచి అడ్మిషన్లు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
Amaravati | విస్తరణకు రూ.వెయ్యి కోట్లు..
ఈ క్యాంపస్‌లో కృత్రిమ మేథ, డేటా సైన్స్, రోబోటిక్స్, కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ వంటి ముందున్న డోమెయిన్‌లపై స్పెషలైజేషన్ కోర్సులు (Specialization Courses) అందించనున్నారు. ఈ క్యాంపస్‌ను డిజిటల్ ఫస్ట్, స్మార్ట్ & గ్రీన్ క్యాంపస్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో 1000 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టనున్నారు. పిలానీతో పాటు హైదరాబాద్, గోవా(GOA) క్యాంపస్‌ల విస్తరణకు రూ.1200 కోట్లు ఖర్చు చేస్తామని కూడా స్పష్టం చేశారు.
2030- 31 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థుల సంఖ్యను 26 వేలకు పెంచుతామని తెలియజేశారు. అమరావతి క్యాంపస్(Amaravati Campus) లో రెండేళ్లు, విదేశీ యూనివర్సిటీల్లో(Foreign Universities) రెండేళ్లు చదివేలా కోర్సులు. జాయింట్ పీహెచ్‌డీలు చేసే అవకాశం కూడా కల్పించనున్నారట.
సీఆర్డీఏ అమరావతిలో 70 ఎకరాల భూమిని క్యాంపస్ కోసం కేటాయించింది. వేంకటేశ్వరస్వామి ఆలయం (Venkateswara Swamy Temple) సమీపంలో ఉండేలా బిట్స్ కోరగా, నిర్మాణ శైలినీ ఆలయ నమూనాలోనే తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు ప్రేరణ ఇచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని బిర్లా పేర్కొన్నారు. తక్కువ ధరకే భూమిని అందించడమే కాకుండా, సీఎం దార్శనికతకు అనుగుణంగా అమరావతిలో ఉన్నత విద్యకు నూతన శకం తీసుకువస్తామన్నారు.
బిట్స్ ఉపకులపతి రామగోపాలరావు (Rama Gopala Rao) మాట్లాడుతూ.. ఈ క్యాంపస్‌లో కంప్యూటర్ సైన్స్‌కు సంబంధించిన అన్ని ప్రధాన ప్రోగ్రామ్స్‌తో పాటు వ్యవసాయం, వాతావరణం, ఆరోగ్యం వంటి రంగాలకు అనుగుణమైన మల్టీడిసిప్లినరీ కోర్సులు అందుబాటులోకి రాబోతున్నాయని చెప్పారు. బిట్స్ ఏఐ ప్లస్ క్యాంపస్ దేశంలోనే ఓ దార్శనిక మైలురాయిగా నిలవనుంది. ఇది విద్యార్థులకు మాత్రమే కాదు, దేశానికే సాంకేతికంగా స్ఫూర్తిదాయకంగా మారనుంది.