14
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bill Gates to Visit Amaravati | మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానుండగా, డిజిటల్ హెల్త్ కేర్, ఏఐ ఆధారిత వ్యవసాయం, ప్రజారోగ్య సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వంతో కీలక చర్చలు జరగనున్నాయి. ‘సంజీవని’ పథకానికి ఈ పర్యటన కీలక మలుపు కావచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
బిల్ గేట్స్ (Bill Gates) సోమవారం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వెల్లడించారు. అమరావతిలో టీడీపీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన సీఎం, బిల్ గేట్స్ పర్యటన రాష్ట్రానికి ప్రాధాన్యత కలిగినదని పేర్కొన్నారు. గతంలో హైటెక్ సిటీ అభివృద్ధి, విశాఖ అగ్రిటెక్ ప్రాజెక్టుల కోసం ఆయనను రాష్ట్రానికి తీసుకువచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ పర్యటన సందర్భంగా బిల్ అండ మెలిండా గేట్స్ ఫౌండేషన్ (Bill & Melinda Gates Foundation) సహకారంతో అమలు చేస్తున్న “సంజీవని డిజిటల్ హెల్త్ కేర్” ప్రాజెక్టు, ఏఐ ఆధారిత వ్యవసాయం, ఇతర సాంకేతిక ప్రాజెక్టులపై సమగ్ర చర్చలు జరగనున్నాయి. గేట్స్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఐటీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) లను కలవనుంది.
Bill Gates to Visit Amaravati | ఆర్టీజీఎస్ సందర్శన
అమరావతికి చేరుకున్న తర్వాత బిల్ గేట్స్ రాష్ట్ర ప్రభుత్వ రియల్‌టైమ్ గవర్నెన్స్ సెంటర్‌ను సందర్శించనున్నారు. పాలనలో సాంకేతిక వినియోగం, డేటా ఆధారిత నిర్ణయాల వ్యవస్థను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. అనంతరం స్వర్ణ ఆంధ్ర విజన్ 2047, ప్రజారోగ్యం, విద్య, వ్యవసాయ రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలపై అధికారులు వివరాలు అందించనున్నారు. తర్వాత ఉండవల్లి సమీపంలోని వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి, డ్రోన్లు, ఏఐ ఆధారిత వ్యవసాయ పద్ధతులపై ప్రదర్శనలను గేట్స్ బృందం పరిశీలించనుంది.
ఆరోగ్య రంగాన్ని డిజిటల్ దిశగా..
ఆరోగ్య రంగాన్ని డిజిటల్ దిశగా మలిచే లక్ష్యంతో రూపొందుతున్న ‘సంజీవని’ పథకం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా నిలుస్తోంది. ఈ పథకం ద్వారా ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ కార్డు అందజేస్తారు. ఇందులో వైద్య చరిత్ర, ల్యాబ్ రిపోర్టులు, వ్యాక్సినేషన్ వివరాలు, ప్రిస్క్రిప్షన్లు వంటి సమాచారం నిల్వ ఉంటుంది. మొబైల్ ద్వారా డాక్టర్ అపాయింట్మెంట్లు బుక్ చేసుకునే సదుపాయం కల్పించనున్నారు. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.2.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స, అవసరమైతే ట్రస్ట్‌ల ద్వారా అధునాతన చికిత్సకు ఆర్థిక సాయం అందించేలా ప్రణాళిక రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మందికి రక్తపరీక్షలు, డయాబెటిస్, బీపీ, గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించనున్నారు. ఏఐ ఆధారిత స్క్రీనింగ్, పర్సనలైజ్డ్ మెడిసిన్ కార్యక్రమాన్ని (Tata Consultancy Services) సహకారంతో అమలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ఆయుష్మాన్ భారత్, రాష్ట్ర హెల్త్ సర్వీసెస్‌తో అనుసంధానం కానుంది.