అక్షరటుడే, వెబ్డెస్క్ : Bihar Elections | త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బీహార్లో ఎలక్షన్ కమిషన్ (Election Commission) మంగళవారం ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తర్వాత రూపొందించిన ఈ జాబితాను పోల్ ప్యానెల్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఓటర్ల జాబితా ప్రకారమే నిర్వహించనున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా మొత్తం 65 లక్షల మంది ఓటర్లను తొలగించారు.
అదే సమయంలో 21.53 లక్షల మందికి ఓటు హక్కు కల్పించారు. తుది జాబితాను గుర్తింపు పొందిన అన్ని జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలకు అందించనున్నట్లు ఈసీ తెలిపింది.
Bihar Elections | భారీగా తొలగింపు
రాష్ట్రంలో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తర్వాత 47 లక్షలకు పైగా అనర్హులు ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. జూన్ 24 నాటికి ఓటరు జాబితాలో మొత్తం 7.89 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అయితే, సవరణ తర్వాత, 65 లక్షల మంది అనర్హులైన ఓటర్లను తొలగించారు.
దీంతో ఆగస్టు 1న ప్రచురించబడిన ముసాయిదా జాబితాలో మొత్తం 7.24 కోట్లకు తగ్గింది. అనంతరం మరో 3.66 లక్షల మంది అనర్హులైన ఓటర్లను కూడా తొలగించడంతో పాటు 21.53 లక్షల మంది అర్హత కలిగిన ఓటర్ల పేర్లను నమోదు చేశారు.
దీంతో తుది జాబితాలో మొత్తం అర్హత కలిగిన ఓటర్ల సంఖ్య 7.42 కోట్లకు చేరుకుంది. ఇక, సవరించిన జాబితా ప్రకారం, పాట్నాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో మొత్తం ఓటర్ల సంఖ్య 48,15,294 గా ఉంది.
ఆగస్టు 1న ప్రచురించబడిన ముసాయిదా జాబితాలో చేర్చబడిన మొత్తం ఓటర్ల సంఖ్య కంటే ఇది 1,63,600 ఎక్కువ అని జిల్లా యంత్రాంగం తెలిపింది.
Bihar Elections | వివాదాస్పదమైన ‘సర్’
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈసీ నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పెద్ద వివాదానికి దారి తీసింది. బీజేపీ (BJP)కి అనుకూలంగా ఓటర్ల జాబితాను తారుమారు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
ఈ ప్రక్రియను నిలిపివేయాలని సుప్రీంకోర్టు (Supreme Court)లో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే, అత్యున్నత న్యాయస్థానం వారి విజ్ఞప్తిని తోసిపుచ్చింది. అయితే, తుది జాబితా ప్రచురించిన తర్వాత కూడా ఏదైనా తప్పులు కనుగొనబడితే మొత్తం ప్రక్రియను రద్దు చేస్తామని స్పష్టం చేసింది.
జాబితాను విడుదల చేయడం చట్టపరమైన సవాళ్ల నుంచి రక్షించదని కోర్టు నొక్కి చెప్పింది. ఈ ప్రక్రియపై తుది విచారణ అక్టోబరు 7న జరగనుంది.
Bihar Elections | బీహార్లో పర్యటించనున్న ఈసీ బృందం
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంసిద్ధతను అంచనా వేయడానికి ఎన్నికల కమిషన్ బృందం అక్టోబరు 4, 5 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనుంది.
ఆ వెంటనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఛత్ పండుగ తర్వాత అక్టోబరు చివరిలో మొదటి దశ ఓటింగ్ జరుగుతుందని భావిస్తున్నారు.