అక్షరటుడే, వెబ్‌డెస్క్: Women Delivered in Exam Centre | బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా (Samastipur District)లో అరుదైన, ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. డిగ్రీ పరీక్షలు రాస్తున్న ఓ గర్భిణి విద్యార్థినికి పరీక్షా కేంద్రంలోనే ప్రసవ వేదనలు రావడంతో, అక్కడి సిబ్బంది సాయంతో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
ఈ ఘటన అక్కడున్న వారిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా, విద్యపై ఆమెకున్న నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. బేగుసరాయ్ జిల్లా (Begusarai District) మల్పూర్ గ్రామానికి చెందిన రవిత కుమారి భరద్వాజ్ కాలేజీలో బీఏ చదువుతోంది. శనివారం థాటియా గ్రామంలోని శశి కృష్ణ కాలేజీ (Shashi Krishna College)లో ఎకనామిక్స్ పేపర్ రాసేందుకు ఆమె హాజరైంది. పరీక్ష కొనసాగుతున్న సమయంలోనే ఆమెకు తీవ్ర ప్రసవ వేదనలు ప్రారంభమయ్యాయి.
Women Delivered in Exam Centre | తల్లి, బిడ్డ క్షేమం..
ఈ పరిస్థితిని గమనించిన పరీక్ష విధుల్లో ఉన్న మహిళా సిబ్బంది వెంటనే స్పందించారు. రవితను ఒక ఖాళీ గదిలోకి తరలించి ప్రాథమిక సహాయం అందించారు. కాలేజీ యాజమాన్యం వెంటనే అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చినా, అది వచ్చేలోపే మహిళా సిబ్బంది ధైర్యంగా వ్యవహరించి అక్కడే ప్రసవాన్ని నిర్వహించారు. కొద్దిసేపటికి పరీక్షా కేంద్రం (Examination Center)లో శిశువు ఏడుపు వినిపించడంతో తోటి విద్యార్థులు, సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం అక్కడికి చేరుకున్న అంబులెన్స్‌లో తల్లీబిడ్డలను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా, నిలకడగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు.
నిండు గర్భిణి అయినప్పటికీ చదువుపై ఉన్న మక్కువతో పరీక్షలకు హాజరైన రవిత కుమారి ధైర్యాన్ని స్థానికులు, విద్యా వర్గాలు ప్రశంసిస్తున్నాయి. వివాహం అయిన తర్వాత కూడా చదువును కొనసాగిస్తూ పరీక్షలకు సిద్ధమవ్వడం ఆమె పట్టుదలకి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ ఘటన విద్య పట్ల అంకితభావం ఉంటే ఏ పరిస్థితినైనా అధిగమించవచ్చని చెప్పే ఉదాహరణగా నిలిచింది.