HomeజాతీయంBihar Politics | బీహార్ లో అతిపెద్ద పార్టీగా బీజేపీ.. మోదీ మేనియా, సంక్షేమ పాలనే...

Bihar Politics | బీహార్ లో అతిపెద్ద పార్టీగా బీజేపీ.. మోదీ మేనియా, సంక్షేమ పాలనే బలగం..!

Bihar Politics | బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. 90కి పైగా స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bihar Politics | బీహార్ ఎన్నికల ఫలితాలు సరికొత్త రికార్డులు సృష్టించాయి. ప్రధానంగా బీజేపీ అద్భుతమైన విజయాన్ని కట్టబెట్టాయి. ప్రధాని మోదీ మేనియాతో కమలం పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది.

మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 200లకు పైగా స్థానాలను సొంతం చేసుకుంది. మహాగట్ బంధన్ కంటే దాదాపు ఏడు రెట్ల మేర అత్యధికంగా సీట్లు కైవసం చేసుకుంది. 90కి పైగా స్థానాలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది.

2020 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓట్ల వాటా 19.8% నుంచి 21.14%కి పెరిగింది. కాషాయ దళం ఈ స్థాయిలో పుంజుకోవడానికి మోదీ మేనియా, సుస్థిర పాలన వంటి అంశాలు కీలకంగా మారాయి.

ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో సహా కీలక బిజెపి నాయకులు ప్రచారం చేసిన “డబుల్ ఇంజిన్ సర్కారు” బీహార్ కోసం ఎలా పని చేసిందో వివరించడం కూడా ప్రభావం చూపింది.

Bihar Politics | తోక పార్టీ నుంచి సొంతగా ఎదిగి..

నిజానికి, గత రెండు దశాబ్దాలలో బీజేపీ ఎప్పుడూ పెద్దగా ప్రభావం చూపలేదు. ప్రతి ఎన్నికలో ఇతర పార్టీలతో కలిసి పోటీకి దిగింది. ప్రధానంగా నితీశ్ కుమార్ పార్టీ జేడీయూకు అనుసంధానంగానే ఎన్నికలకు వెళ్లింది. అయితే, ఈసారి మాత్రం బాగా బలపడిన బీజేపీ నిర్ణయాత్మక స్థాయికి చేరింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాదరణతో పాటు, వివిధ అంశాలు రాష్ట్రంలో బిజెపి చారిత్రాత్మక పనితీరుకు దారితీశాయి. ఇక, అభ్యర్థుల ఎంపికలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది.

సోషల్ ఇంజినీరింగ్ లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి మెరుగైన ఫలితాన్ని సాధించింది. భూమిహార్లు, రాజ్పుట్లు, బ్రాహ్మణులు వంటి ఉన్నత కులాల నుంచి బలమైన ఉనికితో పాటు ఓబీసీ, ఈబీసీల వరకు వివిధ సామాజిక వర్గాలకు సముచిత ప్రాతినిధ్యాన్ని కల్పించింది.

50 శాతం కంటే ఎక్కువ టిక్కెట్లు దళితులు, వెనుకబడిన, అత్యంత వెనుకబడిన, మహిళా అభ్యర్థులకు, యువనేతలకు కేటాయించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

Bihar Politics | గేమ్ ఛేంజర్ ముఖ్యమంత్రి రోజ్గార్ యోజన?

గత సెప్టెంబర్ మాసంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి రోజ్గార్ యోజన బీజేపీకి మాస్టర్ స్ట్రోక్ గా మారింది. ఈ పథకం కింద కోటి మందికి పైగా మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ. 10,000 చొప్పున జమ చేశారు. ఈ పథకం ఎన్డీయే కూటమికి భారీగా ఓట్లు తెచ్చి పెట్టింది.

Bihar Politics | మోదీ మ్యాజిక్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికలకు ముందు బీహార్ లో అనేకసార్లు పర్యటించారు. ప్రచారం అంతటా ఆయన నితీశ్ను పక్కనే పెట్టుకుని సంకీర్ణ ప్రభుత్వ ఐకత్యను ప్రజల ముందు ప్రదర్శించారు.

ప్రచారంలో పదే పదే “జంగిల్ రాజ్” నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఆర్జేడీ మరోసారి అధికారంలోకి వస్తే ఆటవిక పాలన పునరావృతమవుతుందని ప్రచారం చేశారు. తేజస్వి యాదవ్ను “జంగిల్ రాజ్ యువరాజ్” అని మోదీఅభివర్ణించారు. ఎన్డీయే అభివృద్ధి ఎజెండా, ఆర్జేడీ ‘అపహరన్’ (కిడ్నాప్), ‘రంగ్దారి’ (దోపిడీ) వారసత్వం మధ్య జరుగున్న పోటీలో ఓటర్లు ఎటువైపు ఉండాలో తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. డబుల్ ఇంజిన్ సర్కారు ప్రాధాన్యతను నొక్కి చెప్పడం ద్వారా బీహారీలను ఆకట్టుకున్నారు.

ఓట్ల బదిలీ

ఓట్ల బదిలీ సజావుగా జరిగేలా చూసుకోవడానికి బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. దాదాపు 20కిపైగా నియోజకవర్గాల్లో దీనిపైనే ఫోకస్ చేసింది. 2020లో జేడీయూ పోటీ చేసిన దాదాపు 14 సీట్లు ఉన్నాయి.

కానీ వాటిని లోక్ జనశక్తి పార్టీ (RV) మరియు రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM)కి ఇచ్చారు. 2020లో VIP కి ఇచ్చిన 11 సీట్లలో ఎనిమిది చోట్ల బీజేపీ పోటీ చేసింది. గత ఎన్నికల్లో BJP పోటీ చేసిన ఐదు సీట్లలో జేడీయూ పోటీ చేసింది. అయితే, ఓట్ల బదిలీ సజావుగా సాగేందుకు బీజేపీ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ఫలితం సాధించింది.

విఫలమైన కాంగ్రెస్ ఎత్తుగడలు..

బీహార్ లో ఎన్డీయేను గద్దె దించాలన్న కాంగ్రెస్ కలలు స్వీయతప్పిదాలతో కల్లలయ్యాయి. ప్రధానంగా రాహుల్ గాంధీ చేసిన ప్రచారం ఓటర్లను ఏమాత్రం ఆకర్షించలేదు.

బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆయన చేసిన ఆరోపణలను జనం పట్టించుకోలేదు. కాంగ్రెస్ క్యాడర్కు శక్తినిచ్చేలా గాంధీ ఓటు చోరీ ప్రసంగం ఊపును సృష్టించడంలో విఫలమైనట్లు కనిపిస్తోంది.

మరోవైపు, ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీని ఆయన తల్లి తిడుతున్నట్లు వీడియోను కాంగ్రెస్ పార్టీ రూపొందించడం జనాలకు నచ్చలేదు. ఇది ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపేలా చేసింది.

Must Read
Related News