అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bihar Exit Polls | దేశవ్యాప్తంగా బీహార్ ఎన్నికలపై (Bihar elections) ఉత్కంఠ నెలకొంది. రెండు దశల్లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.
బీహార్‌లో అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష మహఘట్‌బంధన్ (Mahaghatbandhan) మధ్య హోరాహోరీగా పోరు నడిచింది. బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ (పాశ్వాన్), ఇతర పార్టీలు కలిపి పోటీ చేశాయి. మరోవైపు ఆర్జేడీ, కాంగ్రెస్, పలు చిన్న పార్టీలతో మహాఘట్బంధన్ (ఎంజీబీ) కూటమిగా (Mahaghatbandhan (MGB) alliance) ఏర్పడ్డాయి. ఎన్డీఏ నుంచి సీఎం అభ్యర్థిగా నితీశ్‌కుమార్‌ను (Nitish Kumar) ప్రకటించగా.. మహఘట్‌బంధన్ కూటమి తరఫున తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) పోటీలో నిలిచారు. అయితే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మరోసారి బీహార్ ఓటర్లు ఎన్డీఏకు పట్టం కట్టనున్నట్లు తెలుస్తోంది.
Bihar Exit Polls | ఎగ్జిట్ పోల్స్ ప్రకారం సీట్లు..
బీహార్ 243 స్థానాలు ఉండగా.. రెండు దశల్లో పోలింగ్ జరిగింది. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ ప్రకారం.. NDA కూటమికి (NDA alliance) 133 నుంచి 159 స్థానాలు వస్తాయి. మహాఘట్ బంధన్ (MGB) కూటమికి 75– 101 స్థానాలు వస్తాయని అంచనా. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ (Jan Suraj Party) ఈ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపలేదని సమాచారం. ఆ పార్టీకి 5 స్థానాలు గెలవచ్చని పీపుల్స్ పల్స్ వెల్లడించింది.
న్యూస్24-మ్యాట్రిజ్ ప్రకారం.. ఎన్డీఏకు 147 –167 స్థానాలు, ఎంజీబీ 70– 90 స్థానాల్లో విజయం సాధిస్తుంది.
పీపుల్ ఇన్సైట్ ప్రకారం.. ఎన్డీఏ 133–148 సీట్లు, ఎంజీబీ 87–102 స్థానాలు కైవసం చేసుకుంటుంది.
దైనిక్ భాస్కర్ ప్రకారం.. ఎన్డీఏ 145–160, ఎంజీబీకి 73–91 సీట్లు వస్తాయి. జేవీసీ పోల్స్ అంచనా ప్రకారం ఎన్డీఏ 135–150, ఎంజీబీ 88–103 స్థానాల్లో విజయం సాధిస్తాయి.
అన్ని సర్వేలు ఎన్డీఏ కూటమి గెలుస్తుందని చెప్పడం గమనార్హం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) బీహార్ ఎన్నికల్లో విస్త్రృతంగా ప్రచారం చేశారు. ఓటు చోరీ పేరిట కేంద్రం, ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేశారు. అయితే ఆర్జేడీ వస్తే మళ్లీ జంగల్‌రాజ్ పాలన వస్తుందని బీజేపీ ప్రచారం చేసింది. దీని ఫలితంగా అధికార ఎన్డీఏ అధిక సీట్లు సాధించనున్నట్లు తెలిసింది. ఈ నెల 14 కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఎగ్జిట్ పోల్స్ నిజం అవుతాయో లేదో ఆ రోజు తేలనుంది.
