అక్షరటుడే, వెబ్డెస్క్ : Bihar Elections | బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై ఎన్నికల సంఘం (Election Commission) కీలక వ్యాఖ్యలు చేసింది. నవంబర్ 22లోపు ఎన్నికలు పూర్తి చేస్తామని ప్రకటించింది.
బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం రెండు రోజుల పాటు ఆ రాష్ట్రంలో పర్యటించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించింది. దీనిపై ఆదివారం ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈవీఎం (EVM)లలోని బ్యాలెట్ పేపర్లలో తొలిసారిగా అభ్యర్థుల కలర్ ఫొటోలను ఉంచనున్నట్లు ఆయన వెల్లడించారు. బూత్ స్థాయి అధికారులు శిక్షణ పూర్తయిందన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1200 మంది ఓటర్లు ఉంటారని పేర్కొన్నారు.
Bihar Elections | తేలికగా గుర్తు పట్టడానికి..
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఎన్ని దశల్లో నిర్వహిస్తామనే దానిపై త్వరలో స్పష్టత ఇస్తామని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. ఈవీఎంలలో పొందుపరిచే బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల కలర్ ఫొటోలను పెడితే అభ్యర్థులను తేలికగా గుర్తు పట్టేందుకు వీలుంటుందని చెప్పారు. సీరియల్ నంబర్ కూడా పెద్దగా కనిపించేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ద్వారా అనర్హులను జాబితా నుంచి తొలగించామని తెలిపారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే తెలిపేందుకు పార్టీలకు ఇంకా గడువు ఉందని వివరించారు.
కాగా నవంబర్ 22లోపు ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో ఈ నెలలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాగా 2020లో రాష్ట్రంలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. 2015లో ఐదు విడతల్లో పోలింగ్ జరిగింది. ఈ సారి ఒకటి, రెండు దశల్లోనే ఎన్నికలు నిర్వహించాలని అభ్యర్థనలు వచ్చినట్లు ఈసీ తెలిపింది. దీనిపై పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.