Nagarjuna
Big Boss | బిగ్‌బాస్ అప్‌డేట్‌..హోస్ట్‌గా కంటిన్యూ కానున్న నాగార్జున‌

అక్షరటుడే, వెబ్​డెస్క్: Big Boss | బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 9కి ప్రారంభానికి ముస్తాబువుతోంది. కొత్త సీజన్ ప్రారంభ ప్రకటనకు ముందే హైప్‌ను సృష్టించడం మొద‌లైంది. ఈసారి హోస్ట్ మారుతార‌న్న ప్ర‌చారానికి తెర ప‌డింది. హీరో నాగార్జున(Hero Nagarjuna) హోస్ట్‌గా కొన‌సాగుతార‌ని స్ప‌ష్టమైంది. వ‌రుస‌గా ఏడోసారి ఆయ‌నే హోస్ట్ చేస్తార‌ని బిగ్‌బాస్ టీమ్ నుంచి అప్‌డేట్ వ‌చ్చింది. సీజన్ 8తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో బిగ్‌బాస్ టీమ్ పూర్తిగా విఫ‌ల‌మైది. ఈ నేప‌థ్యంలో రానున్న కొత్త సీజ‌న్‌ను మ‌రింత కొత్త‌గా, ఆస‌క్తిక‌రంగా తీర్చిదిద్దేందుకు క్రియేటివ్ టీమ్ ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తోంది. మొన్న‌టి సీజ‌న్‌తో కోల్పోయిన ప్రజాదర‌ణ‌ను తిరిగి తీసుకొచ్చేందుకు కొత్త కొత్త గేమ్స్ రూపొందించ‌డంలో నిమ‌గ్న‌మైంది.

Big Boss | హోస్ట్‌పై ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు..

బిగ్‌బాస్ సీజన్ 8 (Bigg Boss Season 8) పూర్తిగా వైఫ‌ల్యం చెంద‌డంతో నాగార్జున హోస్ట్ నుంచి త‌ప్పుకోనున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. ఆయన స్థానంలో నంద‌మూరి బాల‌కృష్ణ‌(Nandamuri balakrishna) లేదా విజ‌య్ దేవ‌ర‌కొండ(Vijay devarakonda) వంటి హీరోల‌ను ఈసారి హోస్ట్‌గా తీసుకొచ్చే అవ‌కాశ‌ముంద‌న్న ప్ర‌చారం అటు మీడియాలో, ఇటు సోష‌ల్ మీడియాల్ వైర‌ల్ అయింది. అయితే, వారితో బిగ్‌బాస్ టీమ్(Bigg Boss team) జ‌రిపిన చ‌ర్చ‌లు ముందుకు సాగ‌లేదు. అయితే, సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారానికి తెర దించుతూ, వ‌రుస‌గా ఏడోసారి అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) హోస్ట్ చేస్తార‌న్న విష‌యం బ‌య‌ట‌కు వచ్చింది. దీన్ని సంబంధిత వ‌ర్గాలు కూడా ధ్రువీక‌రించాయి. ఈ మేర‌కు నాగ్‌.. షో నిర్మాతలతో తన ఒప్పందాన్ని పొడిగించుకున్నాడు. అయితే, ఈసారి మాత్రం పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

Big Boss | ఆక‌ట్టుకున్న జూనియ‌ర్‌, నాని

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 2017లో ప్రారంభం కాగా, అప్ప‌ట్లో హోస్ట్‌గా జూనియ‌ర్ ఎన్టీర్(Jr.NTR) వ్య‌వ‌హ‌రించారు. త‌న ఫాంట‌సీతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. దీంతో సీజ‌న్ వ‌న్ ఘ‌న విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత రెండో సీజ‌న్‌కు ఆయ‌న అందుబాటులో లేక‌పోవ‌డంతో హీరో నాని(Hero Nani) హోస్ట్‌గా వ‌చ్చారు. ఆయ‌న కూడా త‌న స్పాంటేనిటీతో ఆ సీజ‌న్‌ను ర‌క్తి క‌ట్టించారు. మూడో సీజ‌న్ నుంచి వ‌రుస‌గా నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. అయితే, క్రియేటివ్ టీమ్ ప‌నితీరు నాసిర‌కంగా ఉండ‌డం, కొంత మంది అనామకులను హౌస్‌లోకి పంపించ‌డంతో బిగ్‌బాస్(Big Boss) మీద జ‌నాల మోజు త‌గ్గిపోయింది. దీంతో గ‌త సీజ‌న్ దారుణ వైఫ‌ల్యం మూట‌గ‌ట్టుకుంది.

Big Boss | సెప్టెంబర్‌లో ప్రారంభం

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సెప్టెంబర్‌(September)లో ప్రారంభం కానుంది. ఈ మేర‌కు నిర్వాహ‌కుల నుంచి ఓ ట్వీట్ వ‌చ్చింది. దాని ప్ర‌కారం.. షో ప్రారంభించడానికి అంతా సిద్ధంగా ఉంది. తదుపరి సీజన్ కోసం పోటీ పడుతున్న వారిని ఇంకా ఖ‌రారు చేయ‌లేదు. కానీ ఈ సీజన్‌లో కొత్త పోటీదారుల బృందం, ప్రేక్షకులను అబ్బురపరిచే కొత్త థీమ్ ఉంటుంద‌ని బిగ్‌బాస్ టీమ్ తెలిపింది. కొత్త సీజన్ కోసం ఇప్పటికే ఒక పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. తెలుగు వినోద రంగంలో ప్రముఖ నటుడు డిజిటల్ కంటెంట్ సృష్టికర్త అయిన బమ్చిక్ బబ్లూ(Bamchik Bablu) పేరు ఖ‌రారైనట్లు తెలుస్తోంది. ఈసారి అతని ఎంట్రీని మేకర్స్ కూడా ధ్రువీకరించారు. అతని కామిక్ టైమింగ్ హౌస్ లో వినోదాత్మక వాతావరణాన్ని పెంచుతుంద‌ని భావిస్తున్నారు. మిగ‌తా కొందరి పేర్లు ఖ‌రారైన‌ప్ప‌టికీ, ఆ సర్‌ప్రైజ్ ఎలిమెంట్‌ను చివరిదాకా మెయింటేన్ చేయాల‌న్న భావ‌న‌తో పేర్లు రివీల్ చేయ‌డం లేదు.