అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Patanjali Shares | పతంజలి ఫుడ్స్ షేర్ల ధర గురువారం భారీగా పతనమైంది. బుధవారం రోజు ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ. 1,802.25 ఉండగా.. గురువారం ఉదయం రూ. 602.70 వద్ద ప్రారంభమైంది. అంటే ఒక్కరోజులోనే 67 శాతం తగ్గింది.
ఇలా ఒక్కసారిగా 67 శాతం ధర పతనం కావడంతో షేర్ హోల్డర్లు(Share Holders) కాసేపు ఆందోళన చెందారు. అయితే ధర భారీగా తగ్గిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బోనస్ షేర్ల రికార్డు తేదీ(Shares Record Date) కావడంతో ఇలా షేర్ల ధర ఒక్కసారిగా తగ్గింది.
జూలైలో జరిగిన సమావేశంలో పతంజలి ఫుడ్స్ డైరెక్టర్ల బోర్డు బోనస్ ఇవ్వడానికి అంగీకరించింది. ఒక్కో షేరుకు బోనస్‌గా రెండు షేర్లను జారీ చేయాలని నిర్ణయించింది. దీనికి రికార్డ్ డేట్‌గా సెప్టెంబర్ 11ను నిర్ణయించారు. అంటే సెప్టెంబర్ 11 వ తేదీ నాటికి ఎవరి డీమాట్ అకౌంట్‌లోనైతే ఒక పతంజలి షేరు ఉంటుందో.. దానికి మరో రెండు షేర్లు యాడ్ అవుతాయన్న మాట. ఒక్క షేరు మూడు షేర్లుగా మారినందున దానికి అనుగుణంగానే షేరు ధర సర్దుబాటు అయ్యింది. గురువారం ఉదయం రూ. 602.70 వద్ద ప్రారంభమైన పతంజలి ఫుడ్స్(Patanjali Foods) షేరు ధర చివరికి 0.44 శాతం నష్టంతో 598 వద్ద ముగిసింది.
Patanjali Shares | బోనస్ ఎందుకు ఇస్తారంటే..
కంపెనీ షేరు ప్రైస్‌ను అందుబాటు ధరలో ఉంచడంతోపాటు లిక్విడిటీ పెంచడానికి బోనస్ ఇస్తారు. అయితే బోనస్ షేర్ల(Bonus Shares)ను జారీ చేయడం ద్వారా లిక్విడిటీ మాత్రమే పెరుగుతుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో ఎలాంటి మార్పు ఉండదు. బోనస్ షేర్ల జారీ సంస్థ యొక్క బలమైన ఆర్థిక వృద్ధి సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది ఆ కంపెనీ స్టాక్‌పై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచడానికి, వారిని ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. బోనస్ ఇష్యూతో స్టాక్ ధర ఆకర్షణీయంగా మారడంతో ఇన్వెస్టర్లు ఆయా కంపెనీలలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారు. అందుకే కంపెనీలు బోనస్ ఇస్తుంటాయి.