అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nara Bhuvaneshwari | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ వైస్ ఛైర్‌పర్సన్ నారా భువనేశ్వరి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.
లండన్‌లోని (London) గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో ఆమెకు రెండు పురస్కారాలు లభించాయి. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (Institute of Directors) సంస్థ భువనేశ్వరికి ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్–2025’ను ప్రదానం చేయగా, హెరిటేజ్ ఫుడ్స్‌కు లభించిన ‘గోల్డెన్ పీకాక్’ అవార్డును కూడా ఆమె స్వీకరించారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
Nara Bhuvaneshwari | సేవ, వ్యాపార రంగాల్లో రెండు పురస్కారాలు
ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) ప్రజాసేవ, మహిళా సాధికారత, విద్య, వైద్య రంగాల్లో అందించిన సేవలకు గుర్తింపుగా ఈ ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్’ అవార్డు లభించింది. రక్తదాన శిబిరాలు, తలసేమియా బాధితులకు ఉచిత రక్తమార్పిడి, విద్యార్థుల సహాయ పథకాలు, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఆమె చేపట్టిన కార్యక్రమాలు విస్తృతంగా ప్రశంసలు అందుకున్నాయి. అదే సమయంలో హెరిటేజ్ ఫుడ్స్‌ను దేశంలో అగ్రగామి డెయిరీ బ్రాండ్‌గా తీర్చిదిద్దడంలో భువనేశ్వరి కీలక పాత్ర పోషించారు. రైతుల సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ, కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడంలో ఆమె చూపిన దూరదృష్టికి గుర్తింపుగా, ‘ఎక్స్‌లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్’ విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్‌కు ‘గోల్డెన్ పీకాక్’ అవార్డు (Golden Peacock Award) లభించింది.
భారత కాలమానం ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి 1:30 గంటలకు జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ భువనేశ్వరి సేవా తపన, వ్యాపార దూరదృష్టిని ప్రశంసించారు. సేవా రంగం, వ్యాపార రంగం రెండింట్లోనూ ఒకే వేదికపై ఆమె రెండు పురస్కారాలు అందుకోవడం విశేషమని పేర్కొన్నారు. అనంతరం ఈ అవార్డు కార్యక్రమానికి సంబంధించిన వీడియోను ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్నారు. సంజీవని ఫ్రీ హెల్త్ క్లినిక్స్, మొబైల్ హెల్త్ క్యాంప్స్ ద్వారా ఉచిత వైద్య సేవలను అందిస్తున్నామని తెలిపారు.
అలాగే, ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు వొకేషనల్ కోర్సుల ద్వారా శిక్షణ ఇవ్వడంతో పాటు, వారి నైపుణ్యాలను పెంచేలా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళా సాధికారత సాధనలో తమ కృషి కొనసాగుతుందని పేర్కొన్నారు. అలాగే, ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు అండగా నిలిచి, వారు సాధారణ జీవితంలో తిరిగి నిలదొక్కుకునే వరకు సహాయ సహకారాలు అందిస్తున్నామని భువనేశ్వరి వివరించారు.
