అక్షరటుడే, ఇందల్వాయి: Bhubarathi | భూభారతి దరఖాస్తులను వెనువెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) ఆదేశించారు. డిచ్పల్లి తహశీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. తహశీల్దార్, ఇతర సిబ్బందితో భూభారతి (Bhubharathi) అమలుపై సమీక్షించారు.
రెవెన్యూ సదస్సుల్లో (revenue conferences) వచ్చిన దరఖాస్తుల్లో ఆయా మాడ్యుల్స్లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు.. పెండింగ్లో ఎన్ని దరఖాస్తులు ఉన్నాయి.. ఎంత మందికి నోటీసులిచ్చారు.. అలాగే క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయ్యిందా.. తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోపు అన్ని దరఖాస్తులు పరిష్కారమయ్యేలా చూడాలని ఆదేశించారు.
Bhubarathi | కారణాలు వెల్లడించాలి..
దరఖాస్తులు తిరస్కరణ అయితే అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని కలెక్టర్ సూచించారు. సాదాబైనామా, పీవోటీలకు సంబంధించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలన జరపాలని, వెనువెంటనే నోటీసులు జారీ చేస్తూ, క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేయాలన్నారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టంచేశారు.
రోజువారీగా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ, వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా ఎన్నికల సంఘం (Election Commission) మార్గదర్శకాలను అనుసరిస్తూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రాజేంద్ర కుమార్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ సందీప్, తహశీల్దార్ సతీష్, స్థానిక అధికారులు ఉన్నారు.

