అక్షరటుడే, భీమ్‌గల్: భీమ్‌గల్ మున్సిపాలిటీలో (Bhimgal Municipality) రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో 12కు 12 వార్డులను కైవసం చేసుకుని క్లీన్‌స్వీప్ చేసిన బీఆర్ఎస్ పార్టీ ఈసారి బల్దియా ఎన్నికల్లో ఘోరమైన పరాజయాన్ని చవిచూసింది. అభివృద్ధి మంత్రం, అధికార పార్టీపై నమ్మకంతో ఓటర్లు ఈసారి కాంగ్రెస్ పార్టీకి (Congress Party) పట్టం కట్టారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో కాంగ్రెస్ 8 స్థానాలను గెలుచుకోగా, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ 4 స్థానాలకే పరిమితమైంది.
Bheemgal Municipality Results | సునీల్ కుమార్ వ్యూహం.. మహేష్ గౌడ్ ప్రతిష్ట..
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ తనదైన శైలిలో ప్రచారాన్ని ముమ్మరం చేసి, క్షేత్రస్థాయిలో ఓటర్లను ఆకట్టుకోవడంలో సఫలమయ్యారు. దీనికి తోడు స్థానికుడు, పీసీసీ అధ్యక్షుడు, భీమ్‌గల్ మండలం రహత్‌నగర్ గ్రామానికి చెందిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కార్పొరేషన్ ఛైర్మన్లు ఈరవత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి వంటి ఉద్దండులు రంగంలోకి దిగి పావులు కదపడంతో కాంగ్రెస్ విజయం సునాయాసమైంది. పట్టణ అభివృద్ధికి అధికార పార్టీతోనే సాధ్యమన్న వీరి భరోసా ఓటర్లలో నమ్మకాన్ని కలిగించింది.
Bheemgal Municipality Results | ప్రతిఘటించినా ఫలితం దక్కని వేళ..
మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) భీమ్‌గల్‌లోనే మకాం వేసి, స్వయంగా ప్రచార జోరును పెంచినప్పటికీ, బీఆర్ఎస్ తన పాత ప్రభావాన్ని చాటలేకపోయింది. గతంలో వందశాతం ఫలితాలు సాధించిన చోట, ఈసారి కేవలం 4 వార్డులకే పరిమితం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Bheemgal Municipality Results | ఛైర్పర్సన్ పీఠం దక్కెదెవరికో..
మొత్తం 12 వార్డుల్లో 8 వార్డులు గెలిచి స్పష్టమైన మెజారిటీ సాధించడంతో, ఇప్పుడు అందరి దృష్టి ఛైర్పర్సన్ పీఠంపై పడింది. రేసులో ముగ్గురు మహిళా నేతలు గట్టిగా వినిపిస్తున్నారు. ఆరేపల్లి శ్రీజ (వార్డు.3) పట్టణంలోని కీలక సామాజిక సమీకరణాలతో పాటు పార్టీలో మంచి పట్టున్న నేతగా గుర్తింపు పొందారు. అలాగే బొదిరె నాగమణి (వార్డు 6) సీనియారిటీ, స్థానిక సంబంధాలతో ఛైర్పర్సన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. సంటి లత (వార్డు 10) పార్టీ పట్ల విధేయత, వార్డులో సాధించిన మెజారిటీ ఆమెకు కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి.
Bheemgal Municipality Results | క్యాంప్ రాజకీయాలు షురూ..
ఫలితాలు వెలువడిన వెంటనే గెలిచిన అభ్యర్థులు క్యాంప్‌లకు తరలిపోయారు. పార్టీ అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఏది ఏమైనా, భీమ్‌గల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ సాధించిన ఈ విజయం ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అభివృద్ధి పథంలో పట్టణాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త పాలకవర్గం సిద్ధమవుతోంది.