అక్షరటుడే, భీమ్‌గల్ : Bheemgal Development | భీమ్‌గల్ పట్టణాన్ని రూ.కోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినప్పటికీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తమపై దయ చూపలేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (MLA Vemula Prashanth Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. భీమ్‌గల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతూనే, ఓటమిపై విశ్లేషించారు.
Bheemgal Development | ప్రజాపక్షాన పోరాటం..
విజయం వచ్చినా, అపజయం ఎదురైనా బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడుతుందని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ప్రజల తీర్పును గౌరవిస్తూనే, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యేగా గెలిచినా, ఓడినా కౌన్సిలర్ అభ్యర్థులందరం కలిసి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
పనులు పూర్తి చేయాలి..
గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అనేక అభివృద్ధి పనులను ప్రస్తుత ప్రభుత్వం, కొత్త కౌన్సిలర్లు వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఇప్పటికే 80 శాతం పూర్తయిన 100 పడకల ఆస్పత్రిని, 70శాతం పూర్తయిన నూతన మార్కెట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు.
బస్ డిపోను తెరిపించాలి..
మూతపడిన భీమ్‌గల్ బస్ డిపో (Bheemgal Bus Depot)ను వెంటనే తెరిపించి, బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని ప్రశాంత్‌రెడ్డి కోరారు. గతంలో మంజూరు చేసిన రూ.11.5 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులను పూర్తి చేయాల్సిన బాధ్యత గెలిచిన కౌన్సిలర్లపై ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రతిపక్ష పార్టీగా ఒత్తిడి తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీ ఆర్మూర్ మహేష్, మాజీ జెడ్పీటీసీ చౌట్పల్లి రవి, పార్టీ ముఖ్య నేతలు, నూతన కౌన్సిలర్లు పాల్గొన్నారు.