అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Web Series | ప్రస్తుతం పిల్లలు చిన్నప్పటి నుంచే స్మార్ట్‌ఫోన్ (Smart Phone) కు బానిసలుగా మారుతున్నారు. అది వారి భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. తల్లిదండ్రులది బిజీ లైఫ్ కావడంతో పిల్లలను ఆడించే సమయం ఉండటం లేదు. దీంతో చిన్నప్పటి నుంచే ఫోన్ చూపెడుతున్నారు. అది కాస్తా అలవాటుగా మారుతోంది. చాలా మంది పిల్లలు ఫోన్లో వీడియోలు పెడితే గాని అన్నం తినడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఓ బాలుడు వెబ్ సిరీస్‌లు చూసి ఆత్మహత్య చేసుకున్నాడు.
బెంగళూరు (Bangalore)లో గాంధార్ (14) అనే బాలుడు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా కీలక విషయం వెలుగు చూసింది. జపనీస్ (Japanese) వెబ్ సిరీస్ బాలుడి ఆత్మహత్యకు కారణమని పోలీసులు గుర్తించారు. గాంధార్ సోమవారం రాత్రి భోజనం చేశాక ఆత్మహత్య చేసుకున్నాడు. తనను ఎంతో చక్కగా పెంచారని.. ఇన్నాళ్లు తల్లిదండ్రులతో కలిసి ఉన్నందుకు సంతోషంగా ఉన్నానని బాలుడు లేఖ కూడా రాశాడు. ఇక వెళ్లే సమయం ఆసన్నమైందని, ఈ లేఖ చదివే సమయానికి తాను స్వర్గంలో ఉంటానని సూసైడ్ నోట్ రాసి మరి బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నిత్యం ఓ వెబ్ సిరిస్ చూసే గాంధార్ అందులోని ఓ బొమ్మను గదిలో గోడపై గీశాడు. అందులో హీరో పాత్ర చెడ్డవాళ్లు చనిపోవాలని ఓ బుక్‌లో పేరు రాస్తే.. అలాగే జరుగుతుంది. ఆ వెబ్ సిరీస్ చూసే అలవాటు ఉన్న గాంధార్ దాని ప్రభావంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు శుక్రవారం గుర్తించారు.
Web Series | స్మార్ట్‌ఫోన్‌తో జాగ్రత్త
ప్రస్తుతం చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ స్మార్ట్ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు. ఇంట్లో కూడా స్మార్ట్ టీవీ (Smart TV)లు పెట్టుకొని వెబ్‌సిరీస్‌లు, యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారు. అయితే చిన్నప్పటి నుంచి ఇంటర్నెట్కు అలవాటు పడుతున్న పిల్లలు మానసిక వ్యాధుల బారిన పడుతున్నారు. నిత్యం ఫోన్ చూడటంతో నిద్ర లేమి తదితర సమస్యలతో బాధ పడుతున్నారు. కంటి సమస్యలు కూడా వస్తున్నాయి. మొదట మాములు వీడియోలు చూసే పిల్లలు టీనేజీకి వచ్చే సరికి క్రమంగా హింస, అసభ్యకరంగా ఉంటున్న వీడియోలకు అలవాటు పడుతున్నారు. వాటి ప్రభావంతో తల్లిదండ్రుల మాట వినకపోవడం, బాగా చదవకపోవడం లాంటివి చేస్తున్నారు. ఏమైనా అంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులకు దిగుతున్న వారు ఉన్నారు.
Web Series | ఇలా చేయాలి
పిల్లలను వీలైనంత మట్టుకు స్మార్ట్‌ఫోన్‌కు దూరంగా ఉంచాలి. దీనికోసం తల్లిదండ్రులు వారితో ఎక్కువ సేపు గడపాలి. కథలు(Stories), కబుర్లు చెబుతూ కాలక్షేపం చేయాలి. పిల్లలను బయట ఆడుకోవడానికి పంపాలి. ఇంట్లో కూడా చెస్, క్యారమ్ బోర్డు వంటి ఇండోర్ గేమ్స్ ఆడుకునేలా ప్రోత్సహించాలి. స్మార్ట్‌ఫోన్‌తో కలిగే నష్టాలను వారికి వివరించారు. ముఖ్యంగా పిల్లల ముందు తల్లిదండ్రులు ఎక్కువగా ఫోన్ చూడొద్దు.