Homeతాజావార్తలుJubilee Hills by-Elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై రూ.కోట్ల‌లో బెట్టింగ్‌లు.. పందెం రాయుళ్లకు పండుగ..!

Jubilee Hills by-Elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై రూ.కోట్ల‌లో బెట్టింగ్‌లు.. పందెం రాయుళ్లకు పండుగ..!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. మాగంటి గోపినాథ్‌ అకాల మరణంతో ఖాళీ అయిన ఈ స్థానం కోసం ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jubilee Hills by-Elections | హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు (Jubilee Hills by-Elections) ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా బెట్టింగ్‌ వర్గాల్లోనూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి.

మాగంటి గోపినాథ్ (Maganti Gopinath) అకాల మరణంతో ఖాళీ అయిన ఈ స్థానం కోసం జరుగుతున్న ఉప ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా హీట్ క్రియేట్ చేస్తోంది. కేవలం ఒక నియోజకవర్గానికి మాత్రమే ఎన్నిక జరుగుతున్నప్పటికీ, అధికార కాంగ్రెస్ (Congress Party) ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్​లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఇది రెండేళ్ల పాలనపై ప్రజా తీర్పుగా మారుతుందని భావిస్తుండగా.. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకునే అవకాశంగా మార్చుకోవచ్చని అనుకుంటున్నాయి.

Jubilee Hills by-Elections | బెట్టింగ్ రాయుళ్లకు పండుగ..!

రాజకీయ ఉత్కంఠకు తోడు ఈసారి బెట్టింగ్ రాయుళ్లు కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ గెలుపోటములపై క్రికెట్ బెట్టింగ్‌ల స్థాయిలో పందేలు కాస్తున్నారు. తెలంగాణతో (Telangana) పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బులు పోతున్నాయి. ముఖ్యంగా బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, కొండాపూర్‌, మణికొండ, అలాగే విజయవాడ, గుంటూరు, ప్రకాశం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల నుంచి కూడా బెట్టింగ్‌లో పాల్గొంటున్నట్టు సమాచారం. ఇప్పటికే సుమారు రూ.500 కోట్ల విలువైన పందేలు కాసినట్టు తెలుస్తోంది. ఫలితాలు వెలువడే సమయానికి ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.

ఉప ఎన్నికకు సంబంధించి మూడు ప్రధాన అంశాలపై పందేలు న‌డుస్తున్నాయ‌ని తెలుస్తోంది. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారు? విజేత మెజార్టీ 10 వేలకుపైగా ఉంటుందా? తక్కువగా ఉంటుందా? రెండో స్థానంలో ఎవరు నిలుస్తారు? ఈ అంశాలపైనే ప్రస్తుతం బెట్టింగ్ మార్కెట్ (Betting Market) దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పార్టీలు తమ సొంత సర్వేలు చేయించుకుంటూ మా విజయం ఖాయమే అని ప్రచారం చేస్తున్నాయి. మరోవైపు బెట్టింగ్ రాయుళ్లు కూడా తమ డబ్బులు పెట్టే ముందు ప్రైవేట్ ఏజెన్సీలతో సర్వేలు చేయిస్తున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో (Jubilee Hills Constituency) సుమారు నాలుగు లక్షల ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో పోలింగ్ సరళి ఈ విధంగా ఉంది.

2009: 52.76%

2014: 50.18%

2018: 45.59%

2023: 47.49%

ఈ గణాంకాల ప్రకారం.. మొత్తం ఓట్లలో సుమారు 30 శాతం ఓట్లు సాధించిన అభ్యర్థికి గెలుపు సాధ్యమే. ఎవరు గెలుస్తారు? ఎవరికి రెండో స్థానం వస్తుంది? ఈ ప్రశ్నలతో జూబ్లీహిల్స్ రాజకీయంగానే కాదు, బెట్టింగ్ మార్కెట్‌లోనూ ఉత్కంఠ పీక్‌కి చేరింది.