అక్షరటుడే, బోధన్: Fisheries Department | మత్స్య కార్మిక కుటుంబాలను మరింత బలోపేతం చేసేందుకు నాణ్యమైన చేప పిల్లల పెంపకంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించామని ప్రభుత్వ సలహాదారు, బోధన్ సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) తెలిపారు. మత్స్య అభివృద్ధి పథకం కింద 2025-26కు గాను వందశాతం సబ్సిడీపై చెరువులు, రిజర్వాయర్లలో చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా శనివారం ఎడపల్లి మండలం జానకంపేట్లోని అశోక్ సాగర్ చెరువులో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో (Collector Vinay Krishna Reddy) కలిసి చేపపిల్లలను వదిలారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘం (Fisheries Industrial Cooperative Society) సభ్యుల సమక్షంలో చేపపిల్లల రకాలు, సైజ్ను నాణ్యతను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో 4.54 కోట్ల చేప పిల్లలను పెంపకం నిమిత్తం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే అశోక్ సాగర్ (Ashok Sagar) చెరువులో బొచ్చ, రోహు, బంగారు తీగ జాతికి చెందిన చేప పిల్లలను వదిలినట్లు చెప్పారు.
Fisheries Department | నాణ్యతను పరిశీలించాలి
చెరువులు, ఇతర జలాశయాల్లో పిల్లలను వదిలే ముందు మత్స్య కార్మిక సంఘాల సభ్యులు తప్పనిసరిగా వాటి నాణ్యతను పరిశీలించాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సూచించారు. నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగానే చేప పిల్లలు ఉన్నాయా లేదా చూసుకోవాలన్నారు. ఎక్కడైనా తేడా జరిగినా, క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు ఉన్నా, వెంటనే జిల్లా అధికారుల దృష్టికి తేవాలన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నుడా ఛైర్మన్ కేశ వేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మత్స్యశాఖ సహాయ సంచాలకులు ఆంజనేయ స్వామి, మత్య్స కార్మిక సంఘాల ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.
