అక్షరటుడే, వెబ్డెస్క్: Betel nuts | చాలామందికి భోజనం చేసిన తర్వాత లేదా ఖాళీ సమయంలో వక్కపొడి నమలడం ఒక అలవాటుగా ఉంటుంది. పాన్ తయారీలో వాడే వక్కపొడి, పొగాకు వంటి పదార్థాలు శరీరానికి చేసే నష్టం అంతా ఇంతా కాదు. సాధారణంగా పాన్లో సుగంధం కోసం వాడే ఏలకులు, దాల్చిన చెక్క వంటివి ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ, వాటితో పాటు కలిపే వక్కపొడి మాత్రం ప్రాణాంతకమని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.
వక్కపొడిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ప్రధానంగా నోటి క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతుంది. దీనితో పాటు అన్నవాహిక (Esophagus) క్యాన్సర్కు కూడా ఇది దారితీస్తుంది. వక్కపొడిని ఎక్కువగా నమిలే వారిలో ‘సబ్ మ్యూకస్ ఫైబ్రోసిస్’ అనే రసాయనం అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల నోటి లోపలి చర్మం గట్టిపడి, క్రమంగా దవడ కదలికలు తగ్గిపోతాయి. చివరికి నోరు పూర్తిగా తెరవలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఆహారం తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులను కలిగిస్తుంది.
Betel nuts | దంతాల విషయానికి వస్తే..
వక్కపొడి వల్ల చిగుళ్లు వాపుకు గురవుతాయి. దంతాల పైన ఉన్న ఎనామిల్ పొర దెబ్బతిని దంతక్షయం (పంటిలో రంధ్రాలు) సంభవిస్తుంది. నిరంతరం వక్కపొడి వాడటం వల్ల దంతాలు శాశ్వతంగా ముదురు ఎరుపు లేదా నల్లటి రంగులోకి మారిపోతాయి . కేవలం నోటి సమస్యలే కాకుండా, వక్కపొడి గుండె సంబంధిత వ్యాధులకు కూడా కారణమవుతుంది. ఇది శరీర మెటబాలిజంను దెబ్బతీసి, మెటాబొలిక్ సిండ్రోమ్, స్థూలకాయత్వం (బరువు పెరగడం) వంటి సమస్యలను తెచ్చిపెడుతుంది.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, వక్కపొడి శరీరంలో రసాయనిక చర్యలను ప్రేరేపిస్తుంది. ఒకవేళ ఏదైనా అనారోగ్యం కోసం అల్లోపతి మందులు లేదా హెర్బల్ ఔషధాలు వాడుతుంటే, వాటితో వక్కపొడి ప్రతిచర్య జరిపి మందుల ప్రభావాన్ని తగ్గించడమే కాకుండా కొత్త ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది. కాబట్టి, కేవలం సరదా కోసం చేసే ఈ అలవాటు జీవితాన్నే ప్రమాదంలో పడేస్తుంది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం వక్కపొడి, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండటమే మేలు.