అక్షరటుడే, ఇందూరు: Best Available Scheme | జిల్లాలో బెస్ట్ అవైలబుల్ కింద అభ్యసిస్తున్న విద్యార్థులకు నిధులను వెంటనే విడుదల చేయాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో (NTR Chowrastha) సోమవారం నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం కార్పొరేట్ పాఠశాలలో (Corporate school) ప్రవేశపెట్టిన బెస్ట్ అవైలబుల్ స్కీం నీరుగారిపోతుందన్నారు. గత మూడేళ్లుగా నిధులు లేక పాఠశాలల యాజమాన్యాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. దసరా సెలవుల తర్వాత తమ పిల్లలను పాఠశాలలకు అనుమతించలేదని వాపోయారు.
రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని తొలగించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా ఇకనైనా వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బెస్ట్ అవైలబుల్ స్కీం పేరెంట్స్ కమిటీ సభ్యులు, ఎస్ఎఫ్ఐ(SFI) జిల్లా కార్యదర్శి విగ్నేష్, తదితరులు పాల్గొన్నారు.