అక్షరటుడే, బోధన్: Best Available Scheme | బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలను విడుదల చేయాలని విద్యార్థి సంఘాల జేఏసీ (Student Union JAC) ఛైర్మన్ నాగరాజు, జేఏసీ కన్వీనర్ గౌతమ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో (Government Junior College) విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ.. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులు విద్యనభ్యసించేందుకు బెస్ట్ అవైలబుల్ స్కీంను ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిందన్నారు. ఈ పథకం కింద హాస్టల్ విద్యార్థులకు రూ. 42వేలు, డే స్కాలర్‌కు రూ. 25వేల చొప్పున ప్రభుత్వం విద్యార్థుల తరపున చెల్లించాల్సి ఉంటుందన్నారు.
అయితే కొన్నేళ్లుగా స్కీం కింద నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రూ. కోట్లల్లో బకాయిలు పెండింగ్ ఉండడంతో విద్యార్థులను పాఠశాలలకు రానివ్వట్లేదని వాపోయారు. ఈ విషయమై అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పటికీ స్పందించకపోవడం బాధాకరమన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా పేద విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్రవ్యాప్తంగా అవైలబుల్ స్కీం కింద చదువుతున్న విద్యార్థుల బకాయిలను ప్రభుత్వం చెల్లించాలని జేఏసీ తరపున డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanth reddy), ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.