అక్షరటుడే, వెబ్డెస్క్: Bengaluru | బెంగళూరులోని బన్నేరుఘట్టలో ఒక హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ (Software Engineer) తన చెప్పులో దూరిన పాము కాటు వల్ల ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన స్థానికులను విషాదంలో ముంచేసింది.
బన్నేరుఘట్ట రంగానాథ లే అవుట్ (Bannerghatta Ranganatha Layout) నివాసితుడైన మంజు ప్రకాశ్ (41) బెంగళూరులో (Bengaluru) ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం 12:45 సమయంలో బయట నుంచి ఇంటికి వచ్చిన ఆయన.. తన క్రోక్స్ ఫుట్‌వేర్ (Crocs Footwear) విప్పేసి, నేరుగా గదిలోకి వెళ్లి పడుకున్నాడు. అయితే అతడికి తెలియకుండా అప్పటికే చెప్పులో ఒక పాము దూరి ఉంది.
Bengaluru | పాత గాయం..
ఇంటికి వచ్చిన ఓ కూలీకి, మంజు ప్రకాశ్ చెప్పుల పక్కన చనిపోయిన పాము కనిపించింది. ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకి చెప్పగా, వారు అనుమానంతో గదిలోకి వెళ్లి చూడగా, మంజు ప్రకాశ్ మంచంపై నోటి నుంచి నురగలు వస్తూ అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఆయన కాలు వద్ద పాము కాటు గుర్తులు కనిపించాయి. వెంటనే ఆస్పత్రికి తరలించినా, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మంజు ప్రకాశ్ 2016లో జరిగిన బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, అతడి కాలిలో స్పర్శ శక్తి పూర్తిగా కోల్పోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. దాంతో, చెప్పులో ఉన్న పాము కాటేసినా కూడా ఆయన నొప్పిని గమనించలేకపోయాడు. పాముకూడా చెప్పులో ఇరుక్కుపోయి, ఆక్సిజన్ లేక చనిపోయినట్లు భావిస్తున్నారు.
అతడి సోదరుడు మాట్లాడుతూ.. ఇంటికి వచ్చిన వెంటనే గదిలోకి వెళ్లిపోయాడు. ఓ కూలీ చెప్పుల దగ్గర చనిపోయిన పామును (Snake) చూసి మాకు చెప్పాడు. అప్పుడు గదిలోకి వెళ్లి చూస్తే ప్రకాశ్ నురగలు కక్కుతూ కనిపించాడు.. ఏమీ చేయలేకపోయాం అని తీవ్ర ఉద్వేగంతో చెప్పాడు. ఈ ఘటనతో బన్నేరుఘట్ట పరిధిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సహజంగానే స్నేక్ బైట్స్ భయానకమైనవే అయినా, ఈ ఘటన విధి ఎంత వింత నాటకం ఆడిందో చూపించే ఉదాహరణగా మారింది.