అక్షరటుడే, వెబ్డెస్క్ : Bengaluru Car Bus Accident | బెంగళూరు (Bengaluru)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును అతివేగంగా కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు మృతి చెందారు.
బెంగళూరులోని జిందాల్ ఫ్లైఓవర్ సమీపంలో శనివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి రాష్ట్ర రవాణా సంస్థ (KSRTC) బస్సును ఢీకొంది. తుమకూరు నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న ఇండికా కారు అదుపు తప్పి ఫ్లైఓవర్ పై ఉన్న కుడివైపు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం రెండుసార్లు పల్టీలు కొట్టి, బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఐదుగురు మృతి చెందారు. ఆ సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే వారికి ఎలాంటి గాయాలు కాలేదు. కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది.
Bengaluru Car Bus Accident | ఇంట్లో చెప్పకుండా..
కారులోని నలుగురు యువకులు సంఘటనా స్థలంలోనే మరణించారు. డ్రైవర్ లిఖిత్ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారు. మరో బాధితుడిని హర్షిత్ అని గుర్తించారు. అతను డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. ఈ ఐదుగురు యువకులు దొడ్డబల్లాపూర్కు చెందినవారని, ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లినట్లు సమాచారం. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
Bengaluru Car Bus Accident | వరుస ఘటనలు
బెంగళూరులో వరుస రోడ్డు ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. శుక్రవారం ఏడుగురు చనిపోయారు. బెంగళూరు రూరల్ జిల్లాలోని ఎం సత్యవర గ్రామం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున విద్యార్థులతో వెళ్తున్న కారు బైక్, ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో విద్యార్థులు అశ్విన్ నాయర్ (17), అర్హాన్ షరీఫ్ (17), అయాన్ అలీ (17), భరత్ (18), ఏతాన్ జార్జ్ (17) చనిపోయారు. బైక్ రైడర్ గగన్, ఒక ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి సైతం మరణించారు.