HomeజాతీయంBangalore | రిచ్ ఆటోడ్రైవర్‌ కథ సోషల్ మీడియాలో వైరల్.. ఏకంగా ఏఐ కంపెనీలో పెట్టుబ‌డులు

Bangalore | రిచ్ ఆటోడ్రైవర్‌ కథ సోషల్ మీడియాలో వైరల్.. ఏకంగా ఏఐ కంపెనీలో పెట్టుబ‌డులు

ఒక ఆటోడ్రైవర్‌ సంపాదన గురించి ప్రయాణికుడు చేసిన సోషల్ మీడియా పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. రూ.5 కోట్ల విలువైన రెండు ఇళ్లు తనకున్నాయని, వాటి అద్దెల ద్వారా నెలకు సుమారు రూ.3 లక్షలు వస్తున్నాయని ఆ ఆటోడ్రైవర్‌ వెల్లడించాడు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bangalore | దేశంలోనే అత్యంత ఖరీదైన నగరాల్లో ఒకటైన బెంగళూరు మరోసారి అద్భుతమైన కథతో వార్తల్లో నిలిచింది. సాధారణంగా లివింగ్‌ కాస్ట్‌ ఎక్కువగా ఉండే ఈ నగరంలో ఆటో నడిపే ఒక డ్రైవర్‌ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సోషల్ మీడియా (Social Media) చర్చకు కారణమయ్యాడు.

కారణం అతడి సంపాదన, ఆస్తులు, పెట్టుబడులు . ఈ ఆసక్తికర ఘటనను బెంగళూరు (Bangalore)కు చెందిన ఆకాష్ ఆనందాని అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ఇటీవల ఆయన నగరంలో ఒక ఆటోలో ప్రయాణించగా, ఆ డ్రైవర్‌ చేతికి ఆపిల్ వాచ్‌, చెవిలో ఎయిర్‌పాడ్స్‌ కనిపించడంతో ఆశ్చర్యపోయాడు. ఆ విషయంపై మాట్లాడగా, డ్రైవర్‌ చెప్పిన విషయాలు విని ఆకాష్‌ షాక్‌ అయ్యాడు.

Bangalore | రూ.3 ల‌క్ష‌ల రెంట్లు

ఆటోడ్రైవర్ (Auto Driver) చెప్పిన వివ‌రాల‌ ప్రకారం, అతనికి బెంగళూరులో రెండు ఇళ్లు ఉన్నాయని, వాటి విలువ రూ.4 నుంచి రూ.5 కోట్ల మధ్య ఉంటుందని తెలిపాడు. అవి అద్దెకు ఇచ్చి నెలకు రూ.2–3 లక్షల వరకు ఆదాయం వస్తుందని చెప్పాడు. ఇంకా, ఆటో డ్రైవింగ్‌ తన మొదటి పని కావడంతో ఇప్పటికీ వీకెండ్స్‌లో ఆటో నడపడం ఇష్టమని వివరించాడు. అదంతా కాదు, అతను ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (Artificial Intelligence) స్టార్టప్‌లో పెట్టుబడులు పెట్టినట్లు కూడా వెల్లడించాడు. ఈ విషయం ఆకాష్ ఆనందాని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే వైరల్‌ అయ్యింది. నెటిజన్లు దీనిపై విభిన్నంగా స్పందిస్తున్నారు.

కొందరు ఇలాంటి కథలు ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయ‌ని అంటుండ‌గా , మ‌రికొంద‌రు గతంలో బెంగళూరులో కొందరు ఆటోడ్రైవర్లు తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి ఇప్పుడు కోటీశ్వరులయ్యారని చెబుతున్నారు. ఇంకొందరు ఇది కల్పిత కథ అని కొట్టిపారేస్తున్నారు. అయితే ఆకాష్‌ మాత్రం తన పోస్ట్‌ నిజమేనని స్పష్టం చేశాడు. ఇంకొందరు నెటిజన్లు సరదాగా “స్టార్టప్‌ ఫౌండర్లను కలవడానికి ఆటో నడపడం బెస్ట్‌ ఐడియా” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి, ఈ ‘రిచ్ ఆటోడ్రైవర్‌’ కథ ప్రస్తుతం నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది.