అక్షరటుడే, ఇందల్వాయి: Yoga | ‘సూపర్ బ్రెయిన్ యోగా’తో (Super Brain Yoga) అనేక ప్రయోజనాలున్నాయని అంతర్జాతీయ ప్రచారకులు అందె జీవన్‌రావు అన్నారు. ఇందల్వాయి మండలంలోని తిర్మన్ పల్లి ప్రభుత్వ పాఠశాలలో (Tirmanpally Government School) మంగళవారం నిర్వహించిన కార్యశాలలో పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అవార్డు గ్రహీత, గుంజీళ్ల మాస్టారుగా పేరొందిన అందె జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగ ప్రాముఖ్యత వివరించారు. విద్యార్థులతో (students) గుంజీలు తీయించే పద్ధతిని మన దేశంలో శిక్షగా భావించడంతో పాఠశాలల్లో కనుమరుగైందన్నారు. కానీ, పాశ్చాత్య దేశాల్లో ఇది ‘సూపర్ బ్రెయిన్ యోగాగా ప్రాచుర్యంలోకి వచ్చిందన్నారు. క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా జ్ఞాపకశక్తి మెరుగవుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయన్నారు.
ఈ మేరకు పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో 14 సార్లు సూపర్ బ్రెయిన్ యోగా చేయించారు. తాను జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో (international conferences) సమర్పించిన పరిశోధనా పత్రాల ప్రతులను పాఠశాల హెచ్‌ఎం రాజేశ్వరికి ఆందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విజయ్, అనిల్ కుమార్, సునంద, రూప, తదితరులు పాల్గొన్నారు.