అక్షరటుడే, ఇందూరు: Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జలవికాసం పథకం ద్వారా అర్హులైన వారిని లబ్ధిదారులుగా గుర్తించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన గిరి జల వికాసం పథకం అమలుపై జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పథకం అమలు కోసం చేపట్టాల్సిన చర్యల గురించి సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని 15 మండలాల్లో పోడు భూముల్లో పంటలు సాగు చేసుకుంటున్న 5,009 మందికి 10,172 ఎకరాలకు సంబంధించి ఆర్వోఆర్ కింద పట్టాలు అందించినట్లు పేర్కొన్నారు.
పంపిణీ చేసిన పోడు భూములలో సాగు నీటి వసతి కల్పన కోసం సౌర గిరి జల వికాసం పథకం కింద దశల వారీగా లబ్దిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తొలిదశ లబ్ధిదారుల ఎంపిక కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సౌర గిరి జల వికాసం పథకం గురించి విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ పథకం పక్కాగా అమలు జరిగేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, డీఎఫ్వో వికాస్ మీనా (DFO Vikas Meena), బోధన్, ఆర్మూర్ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి, డీఆర్డీవో సాయాగౌడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.