అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ben Stokes | అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ (Anderson Tendulkar Trophy) ఫైనల్ టెస్ట్ మ్యాచ్‌కు ముందు ఇంగ్లాండ్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సిరీస్‌ను చేజిక్కించుకోవాలన్న ఆతిథ్య జట్టు ఆశలకు కెప్టెన్ బెన్ స్టోక్స్ (Captain Ben Stokes) గాయం రూపంలో ముప్పు వాటిల్లింది. భుజం గాయంతో స్టోక్స్ నిర్ణయాత్మక ఓవల్ టెస్ట్‌కు దూరం కావడంతో ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురయ్యారు. స్టోక్స్ రేపటి మ్యాచ్ ఆడడనే విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (England and Wales Cricket Board) అధికారికంగా ప్రకటించింది. స్టోక్స్ స్థానంలో గతంలో జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం ఉన్న ఓలీ పోప్‌కు సారథ్యం అప్పగించారు. యువ ఆటగాడు అయినా, టెక్నికల్ బ్యాట్స్‌మెన్‌గా పేరు పొందిన ఓలీకి ఇది కీలక పరీక్ష కానుంది.
Ben Stokes | స్టోక్స్ ఔట్..
స్టోక్స్ దూరం కావడంతో సెలెక్టర్లు ప్లేయింగ్ XIలో పలువురు కొత్తవారికి చోటు కల్పించారు. ఆర్చర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్ లాంటి ముఖ్యమైన ఆటగాళ్లకు కూడా అవకాశం ఇవ్వలేదు. వీరికి బదులుగా జట్టులోకి జాకబ్ బెథెల్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్, జేమీ ఓవర్టన్‌లను తీసుకున్నారు. ఈ మార్పులు చూస్తుంటే ఓవల్ పిచ్ పేసర్లకు అనుకూలంగా బౌన్స్ ఉండేలా ఏర్పాట్లు చేసినట్టు కనిపిస్తుంది. మాంచెస్టర్ టెస్టులో విజయం సాధించాలని భావించిన ఇంగ్లాండ్‌కు (England) భారత జట్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గిల్, రాహుల్, జడేజా, వాషింగ్టన్ సుందర్ ఆకట్టుకునే ఆటతీరు ప్రదర్శించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో చివరి టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను గెలుచుకోవడమే ఇంగ్లండ్ టార్గెట్.
మాంచెస్టర్‌లో నాలుగో రోజు స్టోక్స్ బౌలింగ్ చేసినప్పటికీ, చాలా అసౌకర్యంగా కనిపించాడు. టీ తర్వాత అసలు బౌలింగ్‌కే రాలేదు. మొత్తంగా 35 ఓవర్లే బౌలింగ్ చేశాడు. స్టోక్స్ గాయం తీవ్రత ఆందోళన కలిగించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ ఫామ్‌లో ఉన్న కెప్టెన్ గాయంతో దూరమవ్వడం ఇంగ్లాండ్‌కు తీరని లోటు అవుతుంది. అయితే, యువ కెప్టెన్ ఓలీ పోప్ (Young Captain Ollie Pope) ఆధ్వర్యంలో ఇంగ్లాండ్ ఎలా ఆటతీరు కనబరుస్తుందో చూడాల్సిందే. ఓవల్ టెస్ట్ సిరీస్ ఫలితాన్ని నిర్ణయించనుండడంతో ఉత్కంఠ మరింత పెరిగింది.
ఇంగ్లండ్ తుది జట్టు : జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్(కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జేమీ స్మిత్(జేమీ స్మిత్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్