అక్షరటుడే, వెబ్‌డెస్క్: Beat Officer Murdered husband | ఆమె ప్రభుత్వ ఉద్యోగిని. మంచి వేతనం.. అదనపు ఆదాయం.. హాయిగా సాగించాల్సిన జీవితాన్ని చేజేతులారా దారి తప్పించింది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న మొగుడిని కడతేర్చింది. ఆపై కట్టుకథ అల్లి తప్పించుకోవాలని చూసింది. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించింది. చివరికి కటకటాల పాలైంది.
భద్రద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇక్కడి వెంగళరావు కాలనీకి చెందిన ధరవత్ హరినాథ్ (39) ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున ఇంటి వెనుక స్లాబ్ హుక్కుకు వేలాడుతూ మృతి చెంది కనిపించాడు.
కాగా, భార్య శృతిలయనే హరినాథ్‌ను చంపిందని ఆయన తల్లి, బంధువులు పాల్వంచ బస్టాండ్ ప్రాంతంలో ధర్నా చేపట్టారు. పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో దిమ్మతిరిగే విషయాలు వెలుగు చూశాయి.
Beat Officer Murdered husband |
హరినాత్ భార్య ధరావత్ శృతిలయ ములుగు జిల్లాలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ Beat Officer గా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె గతంలో చర్ల ఏరియాలో పనిచేసేది. ఆ సమయంలో కొండా కౌశిక్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసి శృతిలయను హరినాథ్ నిలదీశాడు. విషయం పంచాయితీ వరకు వెళ్లింది. అయినా ఆమెలో మార్పు లేదు.
అసలు హరినాథ్నే అడ్డు తొలగిస్తే.. తన వివాహేతర సంబంధానికి అడ్డు ఉండదని భావించింది. ఇందుకు తన ప్రియుడితోపాటు అతడి స్నేహితుల సాయం తీసుకుంది. ఈ నెల (డిసెంబరు) 15న రాత్రి హరినాథ్ మద్యం మత్తులో గాఢ నిద్రలో ఉన్నప్పుడు నిందితులు అతడి గొంతు నులిమి హతమార్చారు.
తర్వాత మృతదేహాన్ని ఇంటి వెనుక స్లాబ్ హుక్కుకు వేలాడదీశారు. చూసేవారికి ఆత్మహత్య అనిపించేలా చిత్రీకరించారు. కానీ, పోలీసుల విచారణలో అసలు నిజాలు వెలుగు చూశాయి. దీంతో నిందితులైన శృతిలయ (36), రంకు మొగుడు కౌశిక్ (31), అతడి స్నేహితులు మోహన్ (32), భాను (23)ను పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చి, రిమాండ్‌కు తరలిలంచారు.