అక్షరటుడే, వెబ్‌డెస్క్: Anand Mahindra | ఆనంద్ మహీంద్రా ప్రస్తుతం మహీంద్రా సంస్థ తయారు చేసిన అత్యంత అధునాతన ఎలక్ట్రిక్ వాహనం ఎక్స్‌ఈవీ 9ఈ(XEV 9e) ని వాడుతున్నారు. అయినా తాను వ్యక్తిగతంగా నడపాలనుకునే కారు మాత్రం ‘బొలెరో’నే అని ఆయన స్పష్టం చేశారు.
ఆ ఎస్‌యూవీ(SUV)తో తనకున్న అనుబంధాన్ని, దాని ప్రత్యేకతలను ‘X’లో వివరించారు. ఆయన ‘ది బీస్ట్ ఈజ్ బ్యాక్’ అంటూ ఆయన పెట్టిన నా పోస్ట్ వైరల్‌గా మారింది. మహీంద్రా నుంచి తొలి హార్డ్‌టాప్ ఎస్‌యూవీ ‘ఆర్మాడా’ వచ్చినప్పటి నుంచి తాను వేరే బ్రాండ్ కారు నడపలేదని ఆనంద్ మహీంద్రా తెలిపారు. అంతకుముందు హిందుస్థాన్ మోటార్స్ కంటెస్సా(Hindustan Motors Contessa) వాడేవాడినన్నారు. బొలెరోను ‘బ్లాక్ బీస్ట్’(Black Beast) అని ముద్దుగా పిలుచుకుంటానని పేర్కొన్నారు. తాను ఇప్పుడు కంపెనీ యొక్క అత్యంత అధునాతన ఎలక్ట్రిక్ వాహనం ఎక్స్‌ఈవీ 9ఈ ని ఉపయోగిస్తున్నప్పటికీ, వ్యక్తిగత డ్రైవింగ్ కోసం కఠినమైన బొలెరో తన అగ్ర ఎంపికగా ఉందని వెల్లడిరచారు.
దృఢత్వం, సరళమైన నిర్మాణం దానిని ఒక నిజమైన ‘ఓల్డ్ స్కూల్ రోడ్ వారియర్’గా నిలబెట్టాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ ‘బీస్ట్’ మళ్లీ తిరిగి వస్తోందని ప్రకటించారు. ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా సరికొత్త అవతార్‌లో బొలెరోను పునరుద్ధరించబోతున్నట్లు తెలిపారు.
Anand Mahindra | ఎన్నోసార్లు నిలిపివేయాలనుకున్నా..
2000 సంవత్సరం నుంచి నిరంతరాయంగా ఉత్పత్తిలో ఉన్న ఈ వాహనం తయారీని ఆపేయాలని చాలాసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదని పేర్కొన్నారు. 2000 సంవత్సరంలో మార్కెట్లోకి వచ్చిన బొలెరో, వ్యాగన్‌ఆర్ తర్వాత నిరంతరాయంగా ఉత్పత్తిలో ఉన్న అత్యంత పాత భారతీయ కార్ బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. ఈ బొలెరో వాహనం మారుతి ఆల్టో(Maruti Alto) కంటే కేవలం ఒక నెల మాత్రమే పెద్దదని ఆనంద్ మహీంద్రా గుర్తుచేశారు. కంపెనీలోని ఆటోమోటివ్ బృందాలు ఎన్నోసార్లు ఈ మోడల్‌ను నిలిపివేయాలని సూచించాయని, కానీ ప్రతిసారీ అది వీడ్కోలు పలకడానికి నిరాకరించిందని పేర్కొన్నారు.
ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటూ కొత్త టెక్నాలజీకి అనుగుణంగా అప్‌డేట్ అవుతూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోందన్నారు. ‘ది బీస్ట్ ఈజ్ బ్యాక్’ (The Beast is Back) అంటూ ఆనంద్ మహీంద్రా చేసిన పోస్ట్‌లో.. 2025లో సరికొత్త అవతార్‌లో బొలెరో రాబోతోందని ప్రకటించారు. ఈ ప్రకటన నేపథ్యంలో బొలెరో అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. పాత హార్డ్ టాప్ ఎస్‌యూవీ వాహనం కొత్త రూపంలో ఎలా రాబోతోందోనన్న విషయమై ఆసక్తి నెలకొంది.