అక్షరటుడే, కామారెడ్డి: Tiger | జిల్లాలోకి ప్రవేశించిన పెద్దపులి సంచారం పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పులి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేయాలని రాష్ట్ర ప్రినిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ అధికారి ఏలుసింగ్ మేరు (Forest Officer Elusingh Meru) జిల్లా అటవీశాఖ అధికారులను ఆదేశించారు.
గత ఐదు రోజుల క్రితం రామారెడ్డి మండలం (Ramareddy mandal) రెడ్డిపేట స్కూల్ తండాలో పెద్దపులి సంచరించిన ప్రాంతాన్ని శుక్రవారం ఏలూసింగ్ మేరు పరిశీలించారు. ఆవుపై దాడి చేసిన ప్రాంతాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెద్దపులి అడుగు జాడలను అధికారులు ఆయనకు చూపించారు. పెద్దపులి ఆచూకీ కోసం ఏర్పాటు చేసిన ట్రాక్ కెమెరాలను (track cameras) ఆయన పరిశీలించారు. పెద్దపులి కదలికలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుండాలని అధికారులకు సూచించారు.
పులి ఎక్కడికి వెళ్తుంది.. ఎలా ఉందనే విషయాలను కనిపెడుతూ ఉండాలన్నారు. పులికి సంబంధించిన సమాచారాన్ని ప్రతిరోజు తమకు పంపించాలని ఆదేశించారు. అంతకుముందు ఆయన కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో వనమహోత్సవం కార్యక్రమంలో (Vanamahotsavam program) పాల్గొని మొక్కలు నాటారు. ఆయన వెంట జిల్లా అటవీశాఖ అధికారిని నిఖిత, ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ రామకృష్ణ, కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, ఫారెస్ట్ రేంజ్ అధికారులు ఉన్నారు.