అక్షరటుడే, ఇందూరు: రాష్ట్రవ్యాప్తంగా బీసీల ధర్మపోరాట దీక్ష నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ (narala Sudhakar) తెలిపారు. ఈ మేరకు నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో (Care Degree College) విలేకరుల సమావేశం నిర్వహించారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర బీసీ జేఏసీ కో–ఛైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపు మేరకు 13న జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో చేపట్టనున్న ధర్మ పోరాట దీక్షల్లో (Dharma Porata Deeksha) వేల సంఖ్యలో బీసీలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
జిల్లాలోని రాజకీయ నాయకులు, బీసీ జేఏసీ నేతలు, బీసీ కుల సంఘాలు, విద్యార్థి, యువజన, మహిళ, ఉద్యోగ సంఘాలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. రాష్ట్ర బీసీ జేఏసీ తీసుకున్న నిర్ణయాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని బీఎల్పీ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ అన్నారు. ఈ ‘ధర్మ పోరాట దీక్ష’లో తాము కూడా పాల్గొంటామని తెలిపారు. ఇది బీసీల మనుగడ కోసం చేస్తున్న పోరాటమని రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆంజనేయులు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ నాయకులు ఆకుల ప్రసాద్, దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, చంద్రకాంత్, కోడూరు స్వామి, బసవ సాయి, ఆర్టీసీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
