అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BC Reservations | పీసీసీ అధ్యక్షుడు (PCC Chief) మహేశ్ కుమార్ గౌడ్‌తో బీసీ సంఘాల నేతలు గురువారం సమావేశం అయ్యారు. గాంధీ భవన్ (Gandhi Bhavan)లో భేటీ అయి బీసీ రిజర్వేషన్లపై చర్చించారు.
బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ జేఏసీ (BC JAC) ఆధ్వర్యంలో ఈ నెల 18న బంద్ తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ బంద్‌కు మద్దతు ఇవ్వాలని బీసీ నేతలు మహేశ్‌గౌడ్‌ను కలిసి కోరారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కోర్టుల్లో బీసీలకు ఎప్పుడూ అన్యాయమే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చెప్పాల్సిన సుప్రీంకోర్టు (Supreme Court)లో అన్యాయం జరిగిందన్నారు. న్యాయ వ్యవస్థలో దారులు మూసుకుపోయాయని ఆయన పేర్కొన్నారు.
BC Reservations | రాజ్యాంగ సవరణ చేయాలి
బీసీ రిజర్వేషన్ల సాధనకు రాజ్యాంగ సవరణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ (PM Modi) ఇంటి ముందు ధర్నా చేస్తే తప్ప ఇది సాధ్యం కాదన్నారు. కోర్టులు ఎప్పుడు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పు చెప్పాయన్నారు. కేంద్రం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయడంతో 50 శాతం ఉన్న రిజర్వేషన్లు 60 శాతం అయ్యాయని జాజాల అన్నారు. అప్పుడు 50 శాతం పరిమితి గురించి కోర్టులు మాట్లాడలేదన్నారు. బీసీల విషయంలో మాత్రమే అడ్డుకుంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
BC Reservations | యుద్ధం చేయాల్సిందే..
బీసీ రిజర్వేషన్ల కోసం యుద్ధం చేయాల్సిందేనని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు (V Hanumantha Rao) అన్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలు (Local Body Elections) నిర్వహించాలని కోరారు. అన్ని పార్టీలతో బీసీ రిజర్వేషన్లపై మాట్లాడాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో రిజర్వేషన్లు అమలు చేయాలని చూసినా.. కేంద్రం అడ్డుకుంటోందన్నారు. బీసీ సంఘాలు ఇచ్చిన బంద్‌కు అందరూ సహకరించాలని ఆయన కోరారు.