అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IPL 2026 | బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్‌కు బీసీసీఐ (BCCI) షాక్ ఇచ్చింది. ఐపీఎల్ నుంచి అతడిని తొలగించింది. బంగ్లాలో హిందువులపై దాడుల నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
ఐపీఎల్ 2026 స్క్వాడ్ నుంచి బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ (Mustafizur Rahman)ను తొలగించమని బీసీసీఐ శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టును కోరింది. బోర్డు కార్యదర్శి దేవాజిత్ సైకియా మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో పలువురు హిందువులు హత్యకు గురైన సంఘటనలు వెలుగులోకి వచ్చినందున, ఇటీవలి పరిణామాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రెహమాన్‌ను జట్టు నుంచి తొలగించిన తర్వాత కేకేఆర్ మరో ఆటగాడిని తీసుకునేందుకు బోర్డు అనుమతిస్తుందని తెలిపారు.
IPL 2026 | రూ.9.20 కోట్లకు కొనుగోలు
అబుదాబిలో జరిగిన మినీ-వేలంలో కేకేఆర్ ముస్తాఫిజుర్‌ను రూ. 9.20 కోట్లకు కొనుగోలు చేసింది. కేకేఆర్, చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) అతడి కోసం పోటీ పడగా.. కోల్‌కతా జట్టు విజయం సాధించింది. అయితే ఇటీవల బంగ్లాదేశ్ హింసాత్మక ఘటనలు, భారత వ్యతిరేక ఆందోళనలు, హిందువుల హత్యలు జరుగుతున్నాయి. దీంతో బంగ్లా ఆటగాళ్లను ఐపీఎల్ నుంచి తొలగించాలని డిమాండ్లు వచ్చాయి. ప్రస్తుతం ఆ దేశం నుంచి ముస్తాఫిజర్ ఒక్కడే ఐపీఎల్ ఆడుతున్నాడు. దీంతో అతడిని తొలగించాలని తాజాగా బీసీసీఐ ఆదేశించింది.
బంగ్లాలో హిందువుల హత్యల వేళ ముస్తాఫిజార్ను కొనుగోలు చేసిన కేకేఆర్ యాజమాన్యంపై బీజేపీ, శివసేన నాయకులు విమర్శించారు. బీజేపీ నాయకుడు సంగీత్ సోమ్ షారుఖ్ ఖాన్‌ను ద్రోహి అన్నారు.రెహమాన్ IPL 2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తరఫున ఆడాడు. మూడు మ్యాచ్‌లు ఆడి, నాలుగు వికెట్లు తీశాడు. ఐపీఎల్ టోర్నీలో అతడు మొత్తం 60 మ్యాచ్‌లు ఆడి 65 వికెట్లు పడగొట్టాడు. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు