అక్షరటుడే, ఇందూరు: BC Reservations | బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని బీసీ సంక్షేమ సంఘం (BC Sankshema Sangham) జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్(Narala Sudhakar) అన్నారు. జిల్లా కేంద్రంలోని పూలాంగ్ చౌరస్తాలో ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తరుణంలో కొందరు అగ్రవర్ణాల వారు కోర్టులో కేసులు వేయడం తగదన్నారు.
వేల సంవత్సరాల తర్వాత న్యాయబద్ధంగా బీసీలకు రావాల్సిన హక్కులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కానీ కొందరు పిటిషన్ దాఖలు చేసి రిజర్వేషన్లను నిలిపేయాలనడం రాజ్యాంగ ద్రోహం అన్నారు. బీసీలకు ద్రోహం చేస్తే ఎవరినైనా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
అగ్రవర్ణాలకు కల్పించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను (EWS reservations) బీసీలు ఎప్పుడు వ్యతిరేకించలేదని గుర్తు చేశారు. కార్యక్రమంలో నాయకులు దేవేందర్, శంకర్, అజయ్, సాయి, శ్రీలత, శ్రీనివాస్, జయ, రుక్మిణి, సదానంద్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.