అక్షరటుడే, కామారెడ్డి: BC JAC | రిజర్వేషన్లు మాకు వేసే భిక్ష కాదని.. మా హక్కు అని బీసీ జేఏసీ నేతలు పేర్కొన్నారు. 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో బీసీ ధర్మపోరాట దీక్ష (BC Dharma Porata Deeksha) చేపట్టారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. బీసీలకు విద్య, ఉద్యోగ (education), రాజకీయ రంగాల్లో 42శాతం రిజర్వేషన్లు పెంచడానికి పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలనే ప్రధాన డిమాండ్‌తో బీసీల ధర్మ పోరాట దీక్ష చేపట్టామన్నారు. రిజర్వేషన్లు ఎవరిచ్చే భిక్ష కాదని, ఇది తమ హక్కు అని పేర్కొన్నారు.
రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు (EWS reservation) 10 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం బీసీలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే (vote bank) చూస్తున్నారని, 60 శాతం ఉన్న బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించకపోతే రాజకీయంగా భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. ఎలాంటి పోరాటాలు చేయని అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కేటాయించి 9వ షెడ్యూల్లో చేర్చిన కేంద్ర ప్రభుత్వం ఇన్నేళ్లుగా పోరాటాలు చేస్తున్న బీసీ సమాజంపై ఎందుకంత నిర్లక్ష్యం చేస్తోందని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్లి పార్లమెంట్లో (Parliament) చట్టం తెచ్చేలా ఒత్తిడి తేవాలన్నారు. త్వరలో ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టి ఆమోదించాలని లేకపోతే పార్లమెంట్ ముట్టడి చేపడతామని హెచ్చరించారు.
కార్యక్రమంలో నాయకులు సాప శివరాములు, నీల నాగరాజు, కుంబాల లక్ష్మణ్ యాదవ్, పండ్ల రాజు, వనం గంగాధర్, రమేష్ బాబు, యాదగిరి, లలిత, మంజుల, రాజేందర్, స్వామి, కొత్తపల్లి మల్లన్న, కన్నయ్య, గుడుగుల శ్రీను, అంజద్, బాను, నారాయణ, కృష్ణహరి, నాగభూషణం, నర్సింలు, రాజయ్య, గంగారాం, వినోద్ నాయక్, రవి, కృష్ణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
