అక్షరటుడే, వెబ్‌డెస్క్: BC Reservations | బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీలకు అండగా నిలబడిన కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో అండగా నిలబడాలని కోరారు.
నల్గొండ జిల్లాలో శనివారం పర్యటించిన మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkata Reddy), పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar).. తిప్పర్తి మండల కేంద్రంలో నిర్మించిన ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్ర అదనపు హాల్‌ను ప్రారంభించారు. అలాగే, మాడుగుల పల్లి మండల కేంద్రంలో రూ.14.70 కోట్ల వ్యయంతో సమీకృత మండల కార్యాలయ భవన సముదాయ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కాంగ్రెస్ పార్టీ(Congress Party)తోనే సాధ్యమని చెప్పారు.
BC Reservations | బీసీలకు న్యాయం చేసింది మేమే..
రాష్ట్ర జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలకు న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న బీసీ రిజర్వేషన్లను(BC Reservations) కొలిక్కి తెచ్చామని, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.
పేద ప్రజల సంక్షేమం కోసమే రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని రాష్ట్రప్రభుత్వం (State Government) పనిచేస్తున్నదన్నారు. నిరుపేదలే లక్ష్యంగా పథకాలు అమలు చేస్తున్నామని, రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని వివరించారు.
అలాగే, నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Houses) నిర్మించి ఇస్తున్నామన్నారు. పేదలకు అండగా ఉంటున్నామని, బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత తమదేనని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు.
BC Reservations | కాంగ్రెస్‌తోనే అభివృద్ధి
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) తోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. పదేళ్ల దుష్ట పాలన తర్వాత రాష్ట్రంలో సుస్థిరమైన ప్రజా పాలన కొనసాగుతోందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామన్నారు.
దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా తెలంగాణలో కుల గణన చేసి, కులాల వారీగా లెక్కలు సేకరించామన్నారు. దశాబ్దాలుగా అన్యాయానికి గురైన బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేసిందని చెప్పారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు.